సాక్షి, న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను చూడటానికి వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై మన దేశంసహా పలు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్థాన్ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే 192 మంది పాక్ యాత్రికులకు చివరి నిమిషంలో వీసా నిరాకరించి షాకిచ్చింది.
వచ్చే నెల 1 నుంచి 8 వరకు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఉర్సు వేడుకలు జరుగనున్నాయి. నేపథ్యంలో ఇందులో పాల్గొనడానికి పాకిస్థాన్ నుంచి సుమారు 200 మంది యాత్రికులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటన్నింటిని భారత్ తిరస్కరించింది. చివరి నిమిషంలో ఈ ప్రకటనతో యాత్రికులు సహా పాక్ అధికారులు ఖంగుతిన్నారు. భారత్ తీసుకున్న చర్య దురదృష్టకరమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ చర్య సబబేనా అని భారత విదేశాంగ శాఖను ప్రశ్నిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. దౌత్య సంబంధాలను దెబ్బ తీసేలా భారత్ చర్యలు ఉన్నాయని.. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని తెలిపింది.
కాగా, 1974 పాకిస్థాన్-ఇండియా ప్రోటోకాల్ ప్రకారం పవిత్ర స్థలాల దర్శన కోసం ఇలా ఇరు దేశాలు వీసా మంజూరు చేసుకోవటం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ అవులియా వర్థంతి సందర్భంగా వందల సంఖ్యలో పాకిస్థానీయులకు ఏటా భారత్ వీసా మంజూరు చేస్తుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది.
Comments
Please login to add a commentAdd a comment