వాషింగ్టన్: అణ్వస్త్ర పరీక్షలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్యకు తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే ఆ మార్గాన్ని తాము ఇంకా ఎంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఉ.కొరియాను అణు నిరాయుధీకరించడంలో ఇతర దేశాలు కూడా తమతో కలవాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
‘సైనిక చర్యకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. కానీ దానిని ఇంకా మేం ఎంచుకోలేదు. మేం సైనిక చర్య చేపడితే మాత్రం అది విధ్వంసకరంగా ఉంటుంది. ఉ.కొరియా తీరు మార్చుకోకపోతే, మేం ఆ పనే చేయాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్‌తో కలసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో హెచ్చరించారు.