బెర్లిన్‌లో షాపింగ్‌కు వచ్చిన వారిపై దూసుకెళ్లిన ట్రక్కు
• బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌లోకి దూసుకుపోయిన ట్రక్కు
• 12 మంది మృతి, 50 మందికి గాయాలు
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ షాపింగ్ సందడితో రద్దీగా ఉన్న మార్కెట్‌లోకి ట్రక్ దూసుకుపోవడంతో 12 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. బెర్లిన్‌లోని కైజర్ విల్‌హెల్మ్ మొమోరియల్ చర్చ్ ముందు మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కెట్‌లో దాదాపు 80 మీటర్ల దూరం జనాల్ని చిదిమేస్తూ, షాపుల్ని కూల్చుకుంటూ ట్రక్కు దూసుకుపోయింది. ఈ సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లో ఇద్దరు యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రక్కు ఆగగానే డ్రైవర్ దూకి పారిపోయాడని, క్యాబిన్‌లో ఒక పోలిష్ జాతీయుడి మృతదేహం లభించిందని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో పాక్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు కారకుడైన వ్యక్తి పేరు నవీద్ (23) అని, అతను ఏడాది క్రితం జర్మనీలో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు అధికారులను ఉటంకిస్తూ స్థానిక బిల్డ్ పత్రిక వెల్లడించింది. ఘటనకు కారణమైన పోలీష్ రవాణా సంస్థకు చెందిన ట్రక్కును నిందితుడు దొంగిలించి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన జరగడానికి నాలుగు గంటల ముందునుంచి ట్రక్కు ఆచూకీ తెలియలేదని సంబంధిత కంపెనీ వెల్లడించింది. చివరిసారిగా డ్రైవర్‌తో మాట్లాడినప్పుడు తాము బెర్లిన్‌లో ఉన్నామని, సోమవారం ఉదయం సరుకు అన్‌లోడ్ చేస్తామని చెప్పినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నవారు తమ డ్రైవర్‌ను ఏదో చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి జర్మన్ పోలీస్ అధికార ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ పాక్ నుంచి శరణార్థిగా వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతనే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించలేదన్నారు.