కిమ్ సోదరుడిని చంపిన మహిళలకు మరణ శిక్ష!
మలేషియా: ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సోదరుడు కింగ్ జాంగ్ నామ్ హత్య విషయంలో ఇద్దరు మహిళలపై మలేషియా పోలీసులు హత్యాభియోగాలు మోపనున్నారు. విచారణ పూర్తి చేసి వారు దోషులుగా తేలితే వారికి మరణ శిక్ష అమలు చేయనున్నారు. మలేషియా అటార్నీ జనరల్ మహ్మద్ అపాంది అలీ ఈ మేరకు బుధవారం వివరాలు తెలియజేశారు.
నామ్ హత్యకు సంబంధించి తదుపరి జరగనున్న పరిణామాలను చెప్పారు. ఇండోనేషియాకు చెందిన సితి ఐసియా, వియత్నాంకు చెందిన డోవాన్ థి హువాంగ్ అనే ఇద్దరు మహిళలపై హత్యాభియోగాలు నమోదుకానున్నాయని, వారు దోషులుగా తేలితే మరణ శిక్షే ఉంటుందని తెలిపారు. అదొక సరదా కార్యక్రమం అని భావించి, అందులో నటించేందుకని అనుకొని తాను 90 డాలర్లు తీసుకొని అవతలి వ్యక్తి చేసినట్లు సితీ ఐసియా చెప్తుండగా మలేషియా పోలీసులు మాత్రం వారిద్దరు ఏం చేస్తున్నారనే విషయం వారికి ముందే తెలుసని చెప్పారు.
మరో ఇద్దరిని కూడా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా వారిలో ఒకరు ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్నారు. మరో ఉత్తర కొరియా వ్యక్తిని మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ ఉత్తర కొరియాకు సంబంధించిన వ్యక్తిపై ఆరోపణలు నమోదు చేయాల్సి వస్తే అతడి విషయంలో కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళతామని తెలిపారు. మరో ఏడుగురు ఉత్తర కొరియాకు చెందినవారి కోసం మలేషియా పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో నలుగురు ఇప్పటికే తమ దేశం పారిపోయారట.