సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం | Aaha kalyanam movie review | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం

Published Fri, Feb 21 2014 7:19 PM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం

సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం

నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్
సంగీతం: ధరన్ కుమార్
కెమెరా: లోగనాధన్ శ్రీనివాసన్
నిర్మాత: ఆదిత్య చోప్రా
దర్శకత్వం: గోకుల్ కృష్ణ
 
బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన బ్యాండ్ బాజా బారాత్ చిత్ర రీమేక్ గా నానీ, వాణీ కపూర్ (శుద్ద్ దేశి రొమాన్స్ ఫేం)ల కాంబినేషన్ లో 'ఆహా కళ్యాణం' రూపొందించారు. అయితే 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రాన్ని తెలుగులో సమంత, సిద్ధార్థ్ లతో 'జబర్దస్త్' గా రూపొందించడం వివాదస్పదమైంది. ఆ కారణంగా ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించి తెలుగులో 'ఆహా కళ్యాణం'గా ఫిబ్రవరి 21 తేది శుక్రవారం విడుదల చేశారు. 'పైసా' తర్వాత నానీ, తెలుగులో తొలిసారి నటించిన వాణి కపూర్ చిత్రం 'ఆహా కళ్యాణం' కథేంటో తెలుసుకుందాం!
 
వెడ్డింగ్ ప్లానర్ గా స్థిరపడి.. ఆతర్వాత తల్లితండ్రులు కుదర్చిన పెళ్లితో జీవితంలో సెటిల్ అవుదామనే లక్ష్యంతో శృతి సుబ్రమణ్యం (వాణి కపూర్) ప్రయత్నిస్తుంటుంది. శృతికి అల్లరి చిల్లరిగా తిరిగే శక్తి(నాని) పరిచయమవుతాడు. ఫైనాన్స్, రొమాన్స్ ను మిక్స్ చేయకూడదనే రూల్ తో శృతి, శక్తి లిద్దరూ 'గట్టి మేళం' అనే కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మ్యారేజ్ ఈవెంట్లను నిర్వహించడంలో 'గట్టి మేళం'కు అనూహ్య పాపులారిటీ వస్తుంది. కాని గట్టి మేళాన్ని ఓ రేంజ్ తీసుకువెళ్లిన శృతి, శక్తిల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. శక్తి హ్యపీ వెడ్డింగ్ అనే పేరుతో మరో ఆఫీస్ ను తెరుస్తాడు. అయితే శృతి, శక్తిల మధ్య విభేదాలకు కారణమేంటి? హ్యాపీ వెడ్డింగ్ ను ప్రారంభించిన శక్తి పరిస్థితేంటి? తమ మధ్య తలెత్తిన విభేదాలను శృతి, శక్తి పరిష్కరించుకున్నారా? శృతి పెద్దలు కుదర్చిన వివాహమే చేసుకుందా? శక్తి, శృతిల విభేదాలకు దర్శకుడు ఎలాంటి పరిష్కారాన్ని చూపారనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
 
ఇటీవల కాలంలో యువతరం నటుల్లో నాని ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆహా కళ్యాణంలో తన పాత్ర పరిధిమేరకు నాని పూర్తి న్యాయం చేకూర్చాడు. ఈ చిత్రంలో కామెడిని కూడ కొంత తన భుజాన వేసుకుని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని డైలాగ్స్, కామెడీ పంచ్ ల టైమింగ్ బాగుంది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి' అనే పాటలో నాని జోష్ ఆకట్టుకునేలా ఉంది. వాణి కపూర్ తో నాని కెమిస్ట్రీ ఫర్ ఫెక్ట్ గా ఉంది. నటుడిగా ఆహా కళ్యాణంతో మరోసారి నాని ఆకట్టుకున్నాడు.
 
ఆహా కళ్యాణం చిత్రాన్ని పరిగణనలోకి తీసుకుని శృతి పాత్రను పరిశీలిస్తే వాణి కపూర్ బ్రహ్మండమైన పెర్ఫార్మెన్స్ అందించింది. చాలా సన్నివేశాల్లో నానిని డామినేట్ చేసే విధంగా ఎమోషన్స్ ను పలికించింది. ఫెర్ఫార్మెన్స్ కాకుండా గ్లామర్ తో అదరగొట్టింది. కొన్ని సన్నివేశాల్లో కత్రినా కైఫ్ లా కనిపించింది.  తన స్క్రీన్ ప్రజెన్స్ తో టాలీవుడ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, అభిమానులను సంపాదించుకోవడానికి 'ఆహా కళ్యాణం' వాణి కపూర్ కు చక్కటి అవకాశం.  టాలీవుడ్ లో వాణి కపూర్ కు అవకాశాలు పెరగడానికి ఈ చిత్రం దోహదపడుతుందని చెప్పవచ్చు. సిమ్రాన్ అతిధి పాత్రలో కనిపించింది. అయితే  పెద్గగా ప్రాముఖ్యత లేని పాత్రలో సిమ్రాన్ దర్శనమిచ్చింది.
 
నానీ. సిమ్రాన్ లు తప్ప వాణి కపూర్ తో సహా అందరూ టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియని వారు ఆహా కళ్యాణంలో ఉండటం ప్రధాన లోపం. 'ఆహా కళ్యాణం' ఆకట్టుకోలేకపోతే అదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సాంకేతికంగా రీరికార్డింగ్ బాగుంది. పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం మరో లోపం. ఈ చిత్రం రీమేక్ కావడం వలన దర్శకుడు గోకుల్ కృష్ణ ప్రతిభను అంచనా వేయడానికి పెద్దగా అవకాశమే లేకపోయింది. కెమెరా పనితనం పర్వాలేదనింపించింది. రీరికార్డింగ్ ఓకే అనిపించేలా ఉన్నా.. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలుగులో తొలి చిత్రాన్ని అందించిన యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
ఒకవేళ జబర్ధస్త్, బ్యాండ్ బాజా బారాత్ చూసినా వాణి కపూర్ ను చూడాలనిపిస్తే ధైర్యం చేయవచ్చు.  చివరగా 'జబర్దస్త్' మిస్ అయిన ప్రేక్షకులకు 'ఆహా కళ్యాణం' ద్వారా మరో అవకాశం చిక్కింది.తమిళ వాసనలతో ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోవడమనేది కష్టమే.

-రాజబాబు అనుముల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement