బాహుబలి వచ్చేస్తున్నాడు!
అవును.. బాహుబలి మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మూడు రోజుల పాటు హైదరాబాద్లో పిల్లలను, పెద్దలను అలరిస్తాడు. ఎప్పుడో 2015లో రావాల్సిన బాహుబలి అప్పుడే ఎలా విడుదలవుతోందని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం బాహుబలి కాదు.. అచ్చం బాహుబలిలాగే ఉండే కామిక్ కాన్. ఇక్కడ పలురకాల గేమ్స్, ఈవెంట్స్ ఉంటాయి. సాధారణంగా ఏడాదికోసారి భారతదేశంలో ఈ కామిక్ కాన్ జరుగుతుంది. ఈసారి దీని కాన్సెప్ట్.. బాహుబలి. అంటే, ఇందులో పాల్గొనాలి అనుకునేవాళ్లు బాహుబలిలా వేషం వేసుకుని రావాలన్న మాట.
తన సినిమా విడుదల బాగా ఆలస్యం అవుతుండటంతో 'బాహుబలి' జనం నోళ్లలో నానేలా ఉండేందుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనూ తనకు నచ్చిన అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో రాజమౌళిది అందెవేసిన చేయి. తన సినిమాయే కాదు.. ఎవరి సినిమా అయినా కూడా అందులో తనకు నచ్చిన అంశం ఏదైనా ఉందంటే వెంటనే సోషల్ మీడియా ద్వారా లేదా ప్రత్యక్షంగా కూడా దాని గురించి ప్రజలకు వివరిస్తారు. అందరూ తప్పనిసరిగా దాన్ని చూసేలా చేస్తారు. అలాగే ఈసారి కూడా బాహుబలిని కామిక్ కాన్లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈనెల 10, 11, 12 తేదీలలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఉత్సవం జరగనుంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ తమ బాహుబలి ఫేస్బుక్ పేజీలో ఉంటాయని రాజమౌళి తన ఫేస్బుక్ పేజీ ద్వారా చెప్పారు. ఇక కార్యక్రమం గురించి, అందులో ఉండే రకరకాల పోటీల గురించి కావాలంటే #Baahubaliatcomiccon చూడాలన్నారు.