బాలి మళ్లింది! | Bollywood actors interested act in south cinemas | Sakshi
Sakshi News home page

బాలి మళ్లింది!

Published Sat, Oct 13 2018 12:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Bollywood actors interested act in south cinemas - Sakshi

మేరే పాస్‌ గాడీ హై.. బంగళా హై.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ హై. తేరే పాస్‌ క్యాహై?ఈ ప్రశ్నకు.. దక్షిణాది ప్రొడ్యూసర్లు ఆహా.. హ్హా.. హా అని నవ్వి...‘మేరే పాస్‌ అమితాబ్‌ హై.. అక్షయ్‌ హై.. ఇంకా.. అజయ్‌ హై.. నవాజ్‌ హై..’ అంటున్నారు!సౌత్‌ ఇండియన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లలో  ఇప్పుడంతా బాలీవుడ్‌ హవా వీస్తోంది.టాలీవుడ్‌కు, మాలీవుడ్‌కు, కోలీవుడ్‌కు  బాలి మళ్లింది!

సౌత్‌ టు నార్త్‌ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు నార్త్‌ టు సౌత్‌ అనాలి. అవును.. ఒకప్పుడు దక్షిణాది తారలు ఉత్తరాది చిత్రాల్లో నటించేవాళ్లు. ఇప్పుడు ఉత్తరాది వాళ్లు దక్షిణాదికి వస్తున్నారు. అఫ్‌కోర్స్‌.. హీరోయిన్ల ఎగుమతి ఎప్పటినుంచో ఉందనుకోండి. అయితే హిందీ నటులు ఇక్కడ నటించడం చాలా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మేల్‌ ఆర్టిస్టులు కూడా దక్షిణాది చిత్రాలపై మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో మన తెరపై కనిపించబోతున్న బాలీవుడ్‌ స్టార్స్‌ ఎవరో ఒకసారి చూద్దాం. 

ఇటు తెలుగు అటు తమిళ్‌
యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో నటుడిగానే కాదు నిర్మాతగానూ తన లక్‌ని టెస్ట్‌ చేసుకున్నారు అమితాబ్‌. డాక్యుమెంటరీలు, మ్యూజికల్‌ వీడియోస్‌లో కూడా మెరిశారాయన. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’తో చిన్ని తెర ప్రేక్షకులను ఆయన మెస్మరైజ్‌ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అమితాబ్‌ ఇవన్నీ చేసింది హిందీ చిత్రపరిశ్రమలోనే. ఇప్పుడు ఆయన చూపు సౌత్‌ ఇండస్ట్రీపై పడింది. ఇంతకు ముందు తెలుగు చిత్రాలు ‘అమృత వర్షం’ (2006), ‘మనం’ (2014)లలో అతిథిలా కనిపించారు. రానా ‘ఘాజీ’ చిత్రానికి గొంతు వినిపించారు. ఇప్పుడు చిరంజీవి ‘సైరా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ‘ఉయంర్ద మణిదన్‌’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తమిళవానన్‌ దర్శకుడు. 

దేనికైనా రెడీ
హిందీలో బయోపిక్స్, సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో అక్షయ్‌ కుమార్‌. కానీ క్యారెక్టర్‌ నచ్చితే విలన్‌గా అయినా రెడీ అంటూ.. ఇప్పుడు దక్షిణాది సినిమా ‘2.ఓ’లో విలన్‌గా చేశారు. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ ముఖ్య తారలుగా రూపొందిన ‘2.ఓ’ చిత్రం ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరిన్‌’కి సీక్వెల్‌. ఈ చిత్రం నవంబర్‌  29న విడుదల కానుంది.

‘పేట్టా’లో నవాజ్‌
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, చాన్స్‌ దొరికితే హీరోగా చేస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. ఇప్పుడీ సూపర్‌ యాక్టర్‌ సౌత్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారాయన. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు నవాజ్‌. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు.

కమల్‌కి విలన్‌గా?
ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉన్న నటుల్లో అజయ్‌ దేవగణ్‌ ఒకరు. యాక్టర్‌గా, నిర్మాతగా ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన కూడా సౌత్‌ బాట పట్టడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అది కూడా శంకర్‌ ‘ఇండియన్‌ 2’ సినిమాలో విలన్‌గా వస్తారట. 22 ఏళ్ల క్రితం శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ నటించిన ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌

‘ఇండియన్‌ 2’. మస్త్‌ బిజీ
రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్త చరిత్ర’ సిరీస్‌లో నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్‌లోనూ మంచి విలన్‌గా పేరు తెచ్చుకున్నారు వివేక్‌ ఒబెరాయ్‌. ఆ టాక్‌తో గతేడాది అజిత్‌ హీరోగా నటించిన ‘వివేగమ్‌’ సినిమాలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో వివేక్‌ నటనకు మంచి అప్లాజ్‌ వచ్చింది. ఇంకేముంది! చాన్సులు క్యూ కట్టాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వివేకే విలన్‌. అలాగే శివరాజ్‌కుమార్‌ ‘రుస్తుం’  మోహన్‌లాల్‌ ‘లూసిఫర్‌’ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌బిజీగా ఉన్నారు వివేక్‌ .

మరికొంతమంది!
మూడేళ్ల క్రితం ‘గోపాల గోపాల’, ‘మలుపు’ చిత్రాల్లో నటించిన  మిథున్‌ చక్రవర్తి ఇటీవల కన్నడ ‘ది విలన్‌’లో నటించారు. మరో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా కన్నడ చిత్రం ‘పహిల్వాన్‌’లో నటిస్తున్నారు. ఇక సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ ప్రస్తుతం సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. తమిళ ‘ఇమైక్క నొడిగళ్‌’ సినిమాతో సౌత్‌ గడప తొక్కిన బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ప్రస్తుతం మలయాళంలో ‘ముతూన్‌’   నటిస్తున్నారట. వీరిలాగే నీల్‌ నితిన్‌ ముఖేష్, మందిరా బేడి సౌత్‌ బాట పట్టారు.ఈ సంగతి అలా ఉంచితే... సౌత్‌ సినిమాల నిర్మాతలు కూడా మార్కెట్‌ను పెంచుకునే ఆలోచనలో భాగంగానే బహు భాషల్లో తమ చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘బాహుబలి’ పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్‌ ‘2.ఓ’, చిరంజీవి ‘సైరా’, ప్రభాస్‌ ‘సాహో’, రానా ‘అరణ్య’, మోహన్‌లాల్‌ ‘ఒడియన్, కుంజాలి మరక్కార్, మహాభారత్‌’ వంటి చిత్రాలు కూడా బహుళ భాషల్లో రిలీజ్‌ కానున్నాయి. ఇలా సౌత్‌ ఇండస్ట్రీ ప్రస్తుతం సినీ ప్రపంచంలో సత్తా చాటుతోంది.
– ఇన్‌పుట్స్‌: ముసిమి శివాంజనేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement