మిత్రహాస్యం | special chit chat with jabardasth team | Sakshi
Sakshi News home page

మిత్రహాస్యం

Published Tue, Dec 9 2014 11:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

మిత్రహాస్యం

మిత్రహాస్యం

ఒకరిది నిజామాబాద్.. ఇంకొకరిది కరీంనగర్.. మరొక రిది తాడేపల్లిగూడెం.. వేరొకరిది విశాఖపట్నం.. ఇలా వాడవాడల నుంచి హైదరాబాద్ చేరుకున్న వీరిని మంచి మిత్రులను చేసింది మాత్రం హాస్యమే. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా.. కష్టనష్టాలున్నా.. వీరికి తెలిసింది నవ్వించడం ఒకటే. అందుకే ఈ స్నేహితులు కామెడీ ట్రాక్ ఎక్కిన ప్రతిసారీ నవ్వుల మతాబులు వెలుగుతూనే ఉంటాయి. వెండితెర, బుల్లితెర.. ఇలా వేదికేదైనా తమ పంచ్‌లతో దుమ్మురేపుతున్న పటాకాలను ‘సిటీప్లస్’ పలకరించింది.
-  శిరీష చల్లపల్లి
 
జీవితంలో భాగం..
నేను 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. వైజాగ్ ఆంధ్ర రేడియో స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ చేసేవాణ్ని. మిమిక్రీ కూడా చేసేవాణ్ని. తర్వాతి కాలంలో దూరదర్శన్‌లో చిన్న చిన్న నాటికలు, స్కిట్స్ రాయడం, యాంకరింగ్ చేయడంతో గుర్తింపు వచ్చింది. దాని ద్వారా సినిమాల్లో అవకాశాలొచ్చాయి. 150 సినిమాల వరకూ చేశాను. మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను. నాకు గుర్తింపు తెచ్చిన కామెడీని ఎప్పుడూ విడిచిపెట్టను. ఈ ట్రాక్‌లోకి రాకపోయి ఉంటే.. టీచర్‌గా ఉండేవాడినేమో. ధన్‌రాజ్, వేణు వీళ్లంతా ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. హైదరాబాద్, సినీఫీల్డ్ నా జీవితంలో భాగమైపోయాయి.
 - రాఘవ
 
బ్రహ్మాండంగా చేయాలని..
నేను బేసిక్‌గా మిమిక్రీ ఆర్టిస్ట్‌ని. నాకు అన్నయ్య, అమ్మ.. వీళ్లే నా లోకం. నేను స్కూల్‌లో చదువుకునే రోజుల్లో నా మిమిక్రీని చూసిన పక్క అపార్ట్‌మెంట్‌లో ఉన్న డెరైక్టర్ వి.ఎన్.ఆదిత్య గారు నన్ను మెచ్చుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు సాయం చేయలేదు. జీవితాన్నే ఇచ్చారు. ఆయన మేలు నేనెన్నటికీ మరువను. నాకు బ్రహ్మానందం గారే ఇన్‌స్పిరేషన్. నా జీవిత లక్ష్యం కూడా అదే. ఆయనంత స్థాయికి ఎదగాలని. అందుకే యే స్కీట్లు, యే షూట్‌లు చేసినా రియలిస్టిక్‌గా చేస్తుంటాను. అందుకు నిదర్శనం.. నా వంటి మీద ఉన్న గాయాలే. నాకు ధన్‌రాజ్ అంటే అమ్మలాగా, అన్న లాగా.. ఆయన పక్కనుంటే నాకెంతో ధైర్యం.
 - రాకేశ్
 
అమితాబ్‌తో చేశా..
సినిమాల్లో కనిపించడానికి 1999లో కరీంనగర్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాను. మా అమ్మానాన్నలకు తొమ్మిది మంది సంతానం. నేనే చిన్నవాడ్ని. అందరూ గారాబంగా చూసేవాళ్లు. వాళ్లు తిన్నా తినకపోయినా.. నాకు మాత్రం మూడు పూటలా తిండి పెట్టేవారు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయింది. ఇంట్లో ముప్పొద్దులా తినే అలవాటాయె.. ఇక్కడ అష్టకష్టాలు పడ్డాను. అన్నపూర్ణ స్టూడియో బయట గేటు దగ్గర ఎన్నో రోజులు, వచ్చిపోయే వాళ్లను చూస్తూ ఉండేవాణ్ని. సెట్‌లు వేసి తీసే పని, చెత్త తీసే పని ఒక్కటని కాదు ఎన్నెన్నో చేశాను. సెట్‌బాయ్‌గా, అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. అలా పనిచేస్తూ.. ‘జై’ సినిమాలో మొదటిసారి కనిపించాను. తెలుగు సినిమాలే కాదు, 3 తమిళ సినిమాల్లో నటించాను. ఒక హిందీ సినిమాలో అమితాబ్‌తో ఒక షాట్ చేశాను. నేను, ధన్‌రాజ్, చంద్ర కలిసి పలు సినిమాల ఆడియో ఫంక్షన్స్‌లో కామెడీ స్కిట్స్ చేశాం. నన్ను చేరదీసి, తిండిపెట్టి.. ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి ‘కత్తపల్లి శేషు’ అండ్ ‘చిత్రం శ్రీను’. వీరిద్దరినీ మరిచిపోలేను. నేను మొదట్లో చిత్రం శ్రీనుకి మేకప్ వేసేవాడిని. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్, ప్రాణ మిత్రుడు అన్నీ..!
 - వేణు
 
వీళ్లే ఆ నలుగురు.
.
మాది నిజామాబాద్. 10వ తరగతి దగ్గరే నా చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగే గొడవలను చూసేవాణ్ని. తర్వాత అద్దంలో చూసుకుంటూ వాటినే ఇమిటేట్ చేసేవాడిని. ఆడోళ్లను బాగా ఇమిటేట్ చేసేవాణ్ని కదా.. అందుకే ఇప్పుడు చీరకట్టుతో అదరగొడుతున్నాను. ఇప్పటి వరకు 35 సినిమాలు చేశాను. వీటిలో కొన్ని రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. నేను, వేణు, తాగుబోతు రమేష్, శ్రీను, రామ్‌ప్రసాద్ మంచి స్నేహితులం. కష్టనష్టాలు పంచుకోవడానికి నలుగురు ఉంటే బాగుండునని అందరూ అనుకుంటారు. ఆ నలుగురు నాకు వీళ్లే.
 
ఫైట్స్ లేని విలన్‌గా..
మాది తాడేపల్లిగూడెం. మా ఇంటి గోడలకు మొత్తం సినిమా పోస్టర్లు అతికించి ఉండేవి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ.. తింటున్నా.. కూర్చున్నా.. ఏం చేసినా.. వాటిని చూడటమే నా పని. వన్ ఫైన్ డే చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమా పోస్టర్ చూసి యాక్టర్ అవ్వాలని ఫిక్సయిపోయాను. టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా.. బస్సెక్కి హైదరాబాద్ వచ్చేశాను. 12 ఏళ్ల కిందటి ముచ్చట. జై సినిమాలో మొదటిసారి కనిపించా. తర్వాత 70 సినిమాల దాకా చేశాను. హీరోగా కూడా ఒక సినిమా చేశాను. విలన్ క్యారెక్టర్ నా డ్రీమ్ రోల్. ఫైటింగ్‌లు లేనివేనండోయ్. రఘువరన్‌లా అదరగొట్టాలని ఉంది. అలాగని నాకు తిండి పెట్టిన కామెడీని మాత్రం వదలను. హైదరాబాద్ పుష్పక విమానం లాంటింది. ఎందరొచ్చినా.. ఇంకొకరికి కచ్చితంగా ప్లేస్ ఉంటుంది.            
- ధన్‌రాజ్
 
జర్నలిస్ట్ అయ్యేవాణ్ని..
నేను 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. మొదట్లో మా టీవీ, టీవీ 9, టీవీ 1, లోకల్ చానల్స్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా, డెరైక్టర్‌గా పనిచేశాను. కామెడీ సైడ్ రాకపోయుంటే.. జర్నలిస్ట్‌గా స్థిరపడేవాణ్ని. ఇప్పుడిప్పుడే సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయి. ఎప్పటికైనా ప్రకాశ్‌రాజ్‌లా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని కోరుకుంటున్నాను. టాలెంట్, పట్టుదల ఉంటే చిత్ర పరిశ్రమ ఆదరిస్తుందని గట్టిగా నమ్ముతాను. నాతో కష్టసుఖాలు పంచుకునే సుధీర్, రాంప్రసాద్ మంచి స్నేహితులు.
 - శ్రీను

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement