వెండితెరకు తాళం
చెన్నై : సినిమా టికెట్లపై 58 శాతం పన్ను విధింపును ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినిమా ప్రదర్శనలను నిరవధికంగా నిలిపివేయడం ద్వారా తమ నిరసన చాటుకోగా రాష్ట్రంలోని వెయ్యి థియేటర్లు మూత పడ్డాయి. సినిమా ప్రదర్శనలను మరలా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక సినిమా రంగం నివ్వెరపోయింది.
సినిమా టిక్కెట్లపై కేంద్రం 28 శాతం, రాష్ట్రం 30 శాతం పన్ను విధింపునకు నిరసనగా తమిళనాడులో సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం ఈనెల 1వ తేదీ నుంచి అమలులోకి రాగా సినిమా టిక్కెట్లపై 28 శాతం పన్నుభారం పడింది. ఇదికాక రాష్ట్ర ప్రభుత్వం మరో 30 శాతం వినోద పన్ను వసూలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోపిన పన్నుభారం 58 శాతానికి చేరుకుంది. భారీ మొత్తంలో పన్ను విధింపు వల్ల సినిమా థియేటర్లను నడపలేని పరిస్థితి నెలకొందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.
పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతూ ఇటీవల సినిమా థియేటర్ల సంఘం మంత్రి జయకుమార్‌కు వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఎగ్జిబిటర్లు తదితర సంఘాల వారు ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. దేశంలో మరే వృత్తి, వ్యాపారాల్లో లేని విధంగా జీఎస్టీ కింద 28 శాతం, రాష్ట్రం 30 శాతం లెక్కన మొత్తం 58 శాతం పన్ను భారాన్ని మోపడం గర్హనీయమని సమావేశం సంఘం అధ్యక్షులు అభిరామి రామనాథన్ అన్నారు.
గత 15 ఏళ్లుగా సినిమా టిక్కెట్ల పెంపును ప్రభుత్వం అనుమతించలేదని చెప్పారు. వినోద పన్నును ప్రభుత్వం రద్దుచేసి టిక్కెట్ల ధరను రూ.50 నుంచి రూ.200లకు పెంచుకునేందుకు అంగీకరించాలని అన్నారు. రెండు రకాల పన్నులను చెల్లించడం తమ వల్ల ఎంతమాత్రం వీలుకాదని ఆయన తేల్చిచెప్పారు. ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని సినిమా థియేటర్లకు వర్తింపజేయాలని, టిక్కెట్ల ధర పెంపునకు అనుమతించాలని తదితర డిమాండ్లపై గతంలో ప్రకటించినట్లుగా సోమవారం నుంచి సినిమా ప్రదర్శనల నిరవధిక నిలిపివేతకు దిగుతున్నట్లు తెలిపారు. కాగా, సినిమా ప్రదర్శనల నిలిపివేత వల్ల రోజుకు రూ.15 కోట్ల వసూళ్లకు బ్రేక్ పడిపోయింది.
నిరాశలో ప్రేక్షకులు.. నిస్పృహలో నిర్మాతలు
సంఘ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని వెయ్యి థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. సమ్మె సంగతి తెలియవారు, షాపింగ్‌మాల్స్‌లో సినిమాలు చూసేందుకు వచ్చిన వేలాది మంది థియేటర్లకు వెళ్లి నిరాశతో వెనుదిరిగారు. సినిమా థియేటర్ల సమ్మెకు తాము మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించిన నిర్మాతల సంఘం నిస్పృహకు లోనైయింది. గత శుక్రవారం విడుదలైన సరికొత్త సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండగా థియేటర్లు మూతపడటం వల్ల కోట్లాదిరూపాయలు నష్టపోతామని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
డీటీహెచ్‌లోకి వెళతాం : సంఘం అధ్యక్షులు విశాల్
పన్నుల భారం, సినిమా థియేటర్ల మూత వంటి కారణాల వల్ల నిర్మాత నష్టపోకుండా డీటీహెచ్ బాట పట్టేందుకు వెనుకాడబోమని తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షులు, నటుడు విశాల్ అన్నారు. సినిమా టిక్కెట్లపై వినోదపు పన్నును రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎడపాడిని సోమవారం కలిసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, నిర్మాతల కోర్కెను సీఎం అంగీకరిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. పన్ను భారం ఇలానే కొనసాగితే నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి ప్రత్యామ్నాయంలో డీటీహెచ్ వైపు వెళ్లక తప్పదని అన్నారు.