కల నిజమయ్యే త్రిపుర కథ!
‘‘ఈ సినిమా కథ అంతా రెడీ అయ్యాక తర్వాత మా కళ్ల ముందు నిలిచిన హీరోయిన్ స్వాతి. త్రిపుర పాత్రకు ఆమే కరెక్ట్ ఛాయిస్’’ అని నిర్మాత చినబాబు అరిగెల అన్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై స్వాతి, నవీన్ చంద్ర జంటగా తెలుగు, తమిళ (‘తిరుపురసుందరి’) భాషల్లో రాజకిరణ్ దర్శకత్వంలో ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘త్రిపుర’. ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చినబాబు, రాజశేఖర్‌లు పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం ఆరంభించిన రోజు నుంచే అంచనాలు మొదలయ్యాయి. దానికి కారణం స్వాతి మంచి కథలతోనే సినిమాలు చేయడం. అలాగే, ‘గీతాంజలి’ చిత్రాన్ని డెరైక్ట్ చేసి రాజకిరణ్ దర్శకుడు కావడం.
‘గీతాంజలి’ హారర్ కామెడీ అయితే, ‘త్రిపుర’ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నవరసాలూ ఉన్న చిత్రమిది. త్రిపుర కథ గురించి చెప్పాలంటే... ఇదొక అమాయక పల్లెటూరి యువతి చుట్టూ తిరిగే కథ. ఆమెకు కొన్ని కలలు వస్తూ ఉంటాయి. అవి నిజమవుతూ ఉంటాయి. ఈ క్రమంలో హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ అలాంటి కలలు మాత్రం వస్తూనే ఉంటాయి. అనుకోకుండా ఆ కలలో తన భర్త కూడా వస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. చాలా ఆసక్తిక రంగా సాగుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్. సినిమా మేకింగ్ అప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో, విడుదల సమయంలో కూడా అలాగే ఉన్నాం. సక్సెస్ గ్యారెంటీ... నో డౌట్. కథపై మాకున్న నమ్మకం అలాంటిది’’ అని చెప్పారు
ముందుగా రిలీజ్‌కి అదే కారణం!
‘‘నిజానికి ఈ చిత్రాన్ని నవంబర్ 27న తె లుగు, తమిళంలో విడుదల చేయాలనుకున్నాం. అయితే ‘అఖిల్’, ‘బెంగాల్‌టైగర్’, ‘శంకరాభరణం’ లాంటి చిత్రాల రిలీజ్‌లు అప్పుడున్నాయి. ఇప్పుడు పెద్ద సంఖ్యలో థియేటర్స్ దొరకడంతో నవంబర్ 6న విడుదల చేస్తున్నాం. స్వాతి ఒప్పుకుంటే ‘త్రిపుర’ తరహాలోనే ఓ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు.