సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిపై ప్రజలను గజిబిజి, గందరగోళానికి గురి చేస్తున్నాయి. అవాస్తవాలు, అర్థ సత్యాలతో కూడిన పోస్టింగ్‌ల కారణంగా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వైరస్ వ్యాపించకుండా అప్రమత్తమయ్యే పోస్టింగులే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టింగులు వైరల్ అవుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకు నీళ్లు తాగితే సరిపోతుందని, పసుపు తింటే తగ్గిపోతుందని వస్తున్న పోస్టింగుల్లో ఎలాంటి వాస్తవం లేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అర్థసత్యాలు, అవాస్తవాలు, వాటికి సమాధానాలు ఇస్తున్నాం. చదువుకోండి.... ప్రాక్టికల్‌గా ఉండి స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మరి దరికి చేరకుండా జాగ్రత్త పడండి. (జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?)
సోషల్ మీడియా: నీళ్లు తాగితే చాలు
వాస్తవం: ప్రతి 15 నిమిషాలకోసారి నీళ్లు తాగడం వల్ల గొంతు ద్వారా ఎలాంటి వైరస్ కూడా శరీరంలోని వెళ్లదని సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ చక్కర్లు కొడుతోంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. కానీ, తరచుగా నీళ్లు తాగడం మంచిదే. శ్వాస సంబంధిత వైరస్‌ల వ్యాప్తిని నిరోధిస్తుందనడంలో మాత్రం శాస్త్రీయత లేదు.
సోషల్ మీడియా: పసుపు తింటే తగ్గిపోతుంది
వాస్తవం: పసుపులో రోగనిరోధక శక్తి ఉంటుందని మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. పసుపు కరోనా వైరస్‌ను నియంత్రిస్తుందనడానికి కూడా ఎలాంటి ఆధారాల్లేవు. సాధారణంగా వైరస్‌లను ఫలానా పదార్థం నియంత్రిస్తుందన్నది ఇంతవరకు ఎక్కడా నిరూపించబడలేదు.
సోషల్ మీడియా: మాస్కులు వైరస్‌ను నియంత్రించలేవు
వాస్తవం: మాస్కులు 100శాతం వైరస్‌ను నిరోధించలేవు. కానీ, వైరస్ వ్యాప్తి చెందే అవయవాలను మాస్కులతో కప్పి ఉంచడం వల్ల తుమ్ములు, దగ్గుల ద్వారా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మాస్కులు ఉపయోగపడతాయి. ఇక, ఈ వైరస్ సోకిన వారు, తుమ్ములు, దగ్గులు వస్తున్న వారు మాస్కులు ధరించడమే ఉత్తమం. ఏదిఏమైనా ఎన్–95 లాంటి నాణ్యమైన మాస్కులను ధరించడం వల్ల ఎంతోకొంత ప్రయోజనమే కానీ నష్టమేమీ లేదు.
సోషల్ మీడియా: ఉప్పు నీళ్లు పులకరిస్తే చాలు
వాస్తవం: ఉప్పు నీళ్లు శ్వాస సంబంధిత వైరస్‌లను నియంత్రించలేవు. బ్లీచింగ్ పౌడర్, ఇథనాల్ లాంటివి పులకరించడంతో ప్రయోజనం ఉంటుంది అని వస్తున్న పోస్టింగుల్లో కూడా వాస్తవం లేదు. కానీ అది చాలా ప్రమాదకరం. అలాగే అతి చల్లని, అతి వేడి వాతావరణం కూడా వైరస్‌ను చంపేస్తుందనడం కూడా శాస్త్రీయంగా నిరూపించబడలేదు.
సోషల్ మీడియా: వెండి పూత నిరోధిస్తుంది
వాస్తవం: ఒక అమెరికన్ వెండిపూతను నీటిలో కలుపుకుని తాగడం వల్ల 12 గంటల్లో వైరస్ చనిపోతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తప్పుడు ప్రచారం వెలుగులోనికి తెచ్చాడు. ఐరన్, జింక్ లాగా మానవ శరీరంపై వెండి ఎలాంటి ప్రభావం చూపించలేదు. పైగా వెండి శరీరంలోకి వస్తే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.
సోషల్‌మీడియా: సాధారణ ఫ్లూ వైరస్‌ల కంటే ప్రమాదం కాదు
వాస్తవం: ఈ వైరస్ సాధారణ ఫ్లూ వైరస్‌ల కన్నా పదిరెట్లు ప్రమాదకరం.
సోషల్ మీడియా: మరికొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది
వాస్తవం: ఈ కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని, అయితే అవి జంతువులు, మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే దశలోనే ఉన్నాయని, మరో ఏడాది వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తొందరంగా వచ్చినట్టేనన్నది వారు చెపుతున్న మాట.
సోషల్ మీడియా: పది సెకన్లు పాటు ఊపిరి బిగపట్టగలిగితే ప్రమాదం లేనట్టే
వాస్తవం: దగ్గకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా 10 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టగలిగితే కరోనా వైరస్ నుంచి ఎలాంటి ప్రమాదం లేనట్టేనని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయాల్లో వాస్తవం లేదు. మీరు 10 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టగలిగినా మీకు కరోనా వైరస్ సోకదనడం సరైంది కాదు.
ప్రాక్టికల్‌గా ఉండాలి.
వీటితో పాటు చాలా మెస్సేజ్‌లు వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో స్థానికంగా జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతున్న విషయాలు తప్ప మిగిలిన వాటిలో వాస్తవం పాళ్లు తక్కువ. అందుకే సోషల్ మీడియాపై పూర్తిగా ఆధారపడకుండా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం, అవసరమైతే హోం క్వారంటైన్ కావడం, టెస్టులు చేయించుకోవడమే ఉత్తమ మార్గం. ఇంకో విషయం ఏమిటంటే... కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేసినా, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేసినా చట్టపరంగా శిక్షార్హులు కూడా. (విదేశీ ప్రయాణమే కొంపముంచిందా?)
Comments
Please login to add a commentAdd a comment