వరద బాధితులకు గూగుల్ సాయం
న్యూఢిల్లీ: భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో వరద సహాయక చర్యలకు టెక్ దిగ్గజం గూగుల్ రూ.6.39 కోట్ల(మిలియన్ డాలర్లు) సాయం ప్రకటించింది. ఈ నిధులను స్వచ్ఛంద సంస్థలు గూంజ్, సేవ్ ది చిల్డ్రన్‌లకు అందిస్తారు. సేవ్ ది చిల్డ్రన్ అన్ని దేశాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో లక్షా 60 వేల మంది బాధితులకు సేవలు అందిస్తోంది.
గూంజ్ భారత్‌లోని 9 రాష్ట్రాల్లో సుమారు 75 వేల కుటుంబాలకు సాయం అందిస్తోంది. బాధితులకు ఆహారం, నీరు, తాత్కాలిక వసతులతో పాటు నీటి వనరుల పునరుద్ధరణ, పిల్లల విద్య వంటి కార్యకలాపాల్లో సేవ్ ది చిల్డ్రన్ చురుగ్గా పాల్గొంటోంది. గూంజ్..బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు, దుస్తులు, పారిశుధ్య పరికరాలు వంటివి సమకూరుస్తోంది. విపత్తు సమయంలో అత్యవసర సందేశాలు పంపే విధానాన్ని కూడా గూగుల్ ఈ మూడు దేశాల్లో ప్రారంభించింది.