ఏడుగురు మంత్రులపై జేడీ(యూ) వేటు
పట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. మరో రెండు రోజుల్లో శాసనసభలో విశ్వాసపరీక్ష జరగనున్న నేపథ్యంలో.. పార్టీ నుంచి బహిష్కృతుడైన ముఖ్యమంత్రి జితన్‌రామ్‌మాంఝీకి మద్దతు తెలిపిన ఏడుగురు మంత్రులను కూడా జనతదాళ్(యూ) సస్పెండ్ చేసింది. మాంఝీ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిందిగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా క్రమశిక్షణను ఉల్లంఘించటంతో మంత్రులు నరేంద్రసింగ్, బ్రిషెన్‌పటేల్, షాహిద్‌అలీఖాన్, సామ్రాట్‌చౌదరి, నితీశ్‌మిశ్రా, మహాచంద్రప్రసాద్‌సింగ్, భీమ్‌సింగ్‌లను సస్పెండ్ చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బశిష్ఠనారాయణ్‌సింగ్ తెలిపారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించనందున.. ఈ నెల 20న విశ్వాసపరీక్ష జరిగే సమయంలో పార్టీ జారీచేసే విప్ వీరికి కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. మాంఝీకి మద్దతు తెలిపిన సాంస్కృతికశాఖ మంత్రి వినయ్‌బీహారీ స్వతంత్ర సభ్యుడు. మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించటంతో.. ఆయన ఏ పార్టీకీ అనుబంధంగా లేని సభ్యుడిగా శాసనసభ స్పీకర్ ఉదయ్‌నారాయణ్‌చౌదరి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో జరగనున్న విశ్వాసపరీక్ష కోసం అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాల రచనల కోసం.. ముఖ్యమంత్రి మాంఝీ, మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌లు తమతమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
నేడు, రేపు బీజేపీ శాసనసభాపక్షం భేటీ...
విశ్వాసపరీక్షలో.. 87 మంది సభ్యులున్న తన వ్యూహమేమిటనేది ఇంకా బయటపెట్టని బీజేపీపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో పరిస్థితిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు వివరించానని సీనియర్ నేత సుశీల్‌కుమార్‌మోదీ పేర్కొన్నారు. అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 117 సంఖ్యను చేరుకోవాలంటే.. మాంఝీకి బీజేపీ మద్దతు చాలా కీలకంగా మారింది. ఈ నేపధ్యంలో.. మాంఝీ సర్కారుకు మద్దతు ఇచ్చే అంశంపై ‘క్షేత్రస్థాయి అభిప్రాయాలు’ తెలుసుకునేందుకు బీజేపీ బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు పార్టీ శాసనసభాపక్షం సమావేశాలను నిర్వహించనుండటం ఉత్కంఠ రేపుతోంది.