కర్ణాటకలో కావే రి మంటలు
-బెంగళూరు, మాండ్య, మైసూరు జిల్లాల్లో బంద్
-కృష్ణరాజసాగర్ డ్యాంలోకి దూకిన రైతులు
-జోక్యం చేసుకోవాలని ప్రధానికి సిద్ధరామయ్య లేఖ
సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై కర్ణాటక మరోసారి భగ్గుమంది. శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌తో సామాన్య జనజీవనం స్తంభించింది. బెంగళూరు సహా, కావేరీ పరీవాహక ప్రాంత జిల్లాల్లో బంద్ విజయవంతం కాగా... మిగతా జిల్లాల్లో మిశ్రమ స్పందన లభించింది. కావే రి ఆందోళనలకు ముఖ్య కేంద్రమైన బెంగళూరు, మాండ్యలతో పాటు సరిహద్దు జిల్లా మైసూరుల్లో భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. రైతులతో పాటు వ్యాపారులు రోజువారీ కార్యకలాపాలను నిలిపివేసి బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులున్నా... తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
కన్నడ హిత రక్షణ వేదిక నేతృత్వంలో 800 కన్నడ సంఘాలు బంద్‌లో పాల్గొనగా విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బళ్లారి, కొప్పాలా, చిక్‌బళ్లాపురా, ధార్వాడ్, కోలా ర్‌జిల్లాల్లో బంద్‌కు సానుకూల స్పందన లభించింది. మాండ్య జిల్లాలో బెంగళూరు-మైసూరు రహదారిపై పలుచోట్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. కృష్ణరాజసాగర్ డ్యాంలోకి ప్రవేశించేందుకు రైతులు యత్నించగా పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు రైతులు గాయపడ్డారు. కొందరు డ్యాంలోకి దూకగా.. వారిని రక్షించారు. పలుచోట్ల సీఎం సిద్ధరామయ్య, ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం జయల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
బెంగళూరులో సర్వం బంద్
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం టెర్మినల్, రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని టౌన్‌హాలు నుంచి ఫ్రీడం పార్కు వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఒక వ్యక్తి కత్తితో తీవ్రంగా గాయపర్చుకోగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా, ఆటోలు, క్యాబ్ యజమానులు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా పూర్తిగా స్తంభించింది.మెట్రో సర్వీసులూ రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.పెట్రోల్ బంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కన్నడ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తమిళ చానళ్ల ప్రసారాన్ని నిలిపివేశాయి. మాండ్య, మైసూరు జిల్లాల్లో పలు చోట్ల కర్ణాటక, సిద్ధరామయ్య, జయ మాస్క్‌లతో కూడిన దిష్టిబొమ్మలకు పెళ్లి జరిపించి నిరసన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో కర్ణాటకలో భద్రతను ముందుగానే కట్టుదిట్టం చేశారు
.
ప్రతిష్టంభనకు తెరదించండి.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణం ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ న్విహించి ప్రతిష్టంభనకు ముంగిపు పలకాలంటూ ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితమవుతుందని, దేశానికి భారీ ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొస్తున్న ఐటీ పరిశ్రమ దెబ్బతింటుందని పేర్కొన్నారు.. 1995లో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు సమస్యను పరిష్కరించాలంటూ ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు కోరిందన్న విషయాన్ని గుర్తు చేశారు.