బెంగళూరు : విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు ‘వినూత్న’ విధానాన్ని అవలంభించిన కాలేజీ యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు కూడా మనుషులేనని... వారిని జంతువుల్లా భావించడం సరికాదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని హవేరీ పట్టణంలో గల భగత్ ప్రీ-యూనివర్సిటీ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరి పేపర్లలో ఒకరు చూసి రాయకుండా చేసేందుకు లెక్చరర్లు వారి తలపై అట్టెపెట్టెలు బోర్లించారు. అంతేగాకుండా పెట్టె పక్కకు పోయిన ప్రతిసారీ ఇన్విజిలేటర్ వచ్చి విద్యార్థులను హెచ్చరిస్తూ వాటిని సరిచేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది విద్యార్థులకు మాత్రం అట్టపెట్టెల నుంచి లెక్చరర్లు మినహాయింపు ఇచ్చారు.
ఇక ఈ విషయంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులను జంతువుల్లా ట్రీట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంపై కఠిన చర్యలు ఉంటాయి’అని ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటన గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. విషయం తెలిసి తాము కాలేజీ వద్దకు వెళ్లామని... అట్టెపెట్టెలు తొలగించామని తెలిపారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని... ఇటువంటి విషయాల్లో విద్యార్థులు చెప్పినట్లు వినాల్సిన పనిలేదని వారికి చెప్పామన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకోవడం విశేషం. కాలేజీ హెడ్ సతీశ్ మాట్లాడుతూ.. బిహార్‌లో కూడా ఇటువంటి విధానం అనుసరించారని.. తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. విద్యార్థులు పక్క చూపులు చూడకుండా ఇదో సరికొత్త ప్రయోగం అని పేర్కొన్నారు.
విద్యార్థుల తలపై అట్టపెట్టెలు.. మంత్రి ఆగ్రహం!
Published Sat, Oct 19 2019 3:15 PM | Last Updated on Sat, Oct 19 2019 5:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment