'దాక్షాయణి' అరుదైన ఘనత!
త్రివేండ్రం: కేరళలోని త్రివేండ్రంకు చెందిన ఏనుగు 'దాక్షాయణి' గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కనుంది. ప్రపంచంలో జీవించివున్న ఏనుగుల్లో అత్యధిక వయసు కలిగిన ఏనుగమ్మగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించనుంది. 86 ఏళ్ల వయసున్న 'దాక్షాయణి' పేరును రికార్డులకు ఎక్కించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీబీడీ) ఇప్పటికే గిన్నిస్ అధికార వర్గాలకు లేఖ రాసింది.
శబరిమల సహా 1,250 ఆలయాలు టీబీడీ పరిధిలో ఉన్నాయి. టీబీడీ దగ్గర 33 ఏనుగులు ఉన్నాయి. ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో వివిధ సేవలకు వీటిని వినియోగిస్తుంది. తైవాన్ లో 85 ఏళ్లు బతికిన ఏనుగు 2003లో మరణిచిందని టీబీడీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ తెలిపారు. గిన్నిస్ బుక్ లో దాక్షాయణి పేరుకు నమోదుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీని పేరుతో కేరళలో పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయనున్నామని వెల్లడించారు. 1949లో ట్రావెర్ కోర్ రాజకుటుంబం ఈ ఏనుగును టీబీడీకి బహూకరించిందని చెప్పారు.