మోదీకి ‘ఎగ్జిట్’ మోదం
⇒ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ ముందంజ
⇒ తేల్చిన ఎగ్జిట్ పోల్స్
⇒ యూపీలో అతిపెద్ద పార్టీగా కమలం.. పూర్తి మెజారిటీ వస్తుందని కొన్ని..
⇒ హంగ్ తప్పదని మరికొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థల జోస్యం
⇒ పంజాబ్‌లో కాంగ్రెస్–ఆప్ మధ్య హోరాహోరీ.. మూడోస్థానానికి అకాలీ–బీజేపీ
⇒ మణిపూర్‌లో కాంగ్రెస్–బీజేపీ నువ్వానేనా.. రేపే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ:
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగనుందా? పంజాబ్, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ దుమ్ము రేపనుందా? ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడనుందా? గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సరళిని చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది! 403 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సగటును చూస్తే.. బీజేపీకి యూపీలో 164–210 సీట్లు రావొచ్చని తేలింది. అధికారం చేపట్టేందుకు కావాల్సిన 202 (మ్యాజిక్ ఫిగర్) సీట్లకు కొద్ది దూరంలో బీజేపీ ఆగిపోతుందని, ఫలితంగా హంగ్ సర్కారు ఏర్పడుతుందని కొన్ని సర్వేలు పేర్కొనగా.. మరికొన్ని మాత్రం ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలిపాయి.
బీజేపీకి 285 సీట్ల వరకు వస్తాయని న్యూస్ 24 చాణక్య తెలపగా.. 251–279 సీట్లు గెల్చుకుంటుందని ఇండియా టుడే–యాక్సిస్, 190–210 సీట్లు గెలవొచ్చని టైమ్స్‌నౌ–వీఎంఆర్ అంచనా వేశాయి. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి గరిష్టంగా 169 సీట్ల వరకు గెల్చుకోవచ్చని ఏబీపీ–లోక్‌నీతి తెలిపింది. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ వంద కన్నా తక్కువ సీట్లే నెగ్గుతుందని అన్ని సర్వేలు తేల్చాయి. ఉత్తరాఖండ్, గోవాలో కూడా బీజేపీ గాలి వీస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని మెజారిటీ సర్వేలు తేల్చాయి.
40 అసెంబ్లీ సీట్లున్న గోవాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేదని కొన్ని, ఆ పార్టీయే అధికారం చేపడుతుందని మరికొన్ని తెలి పాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మధ్య హోరా హోరీ ఉంటుందని, ఇక్కడ ఏ పార్టీ అయినా బొటాబొటీ మెజారిటీతోనే అధికారం చేపట్టవచ్చని పేర్కొన్నాయి. మణిపూర్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే తెలపగా.. బీజేపీ గద్దెనెక్కుతుందని సీ–ఓటర్ పేర్కొన్నాయి. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీల జాతకాలు శనివారంతో తేలిపోనున్నాయి.
బీఎస్పీకి ఓబీసీ పోటు..
ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన బీఎస్పీకి ఓబీసీల రూపంలో దెబ్బపడిందని అంచనా వేస్తున్నారు. జనామోద ముస్లిం నేత కూడా లేకపోవడంతో ఆ వర్గం వారు బీఎస్పీకి దూరమయ్యారు. దళితులు పార్టీకి అండగా నిలిచినా.. వారి ఒక్కరి మద్దతుతో అధికారం చేపట్టడం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూపీలో బీజేపీకి కలిసొచ్చినవి ఇవే..
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మక ఎత్తుగడలు యూపీ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చాయని చెబుతున్నారు. టికెట్ల పంపిణీ నుంచి ఎన్నికల ప్రచారం వరకూ అన్నీ తానై ఆయన వ్యవహరించారు. కులాల సమీకరణలకు అనుగుణంగా పావులు కదిపారు. ముఖ్యంగా ఓబీసీ ఓట్లు చేజారకుండా కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించడం కలసొచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఉంటే బీజేపీకి మరింత లాభదాయకంగా ఉండేదని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎస్పీ–కాంగ్రెస్ జోడీ ఫెయిలైందా?
సమాజ్‌వాది పార్టీ కుటుంబ కలహాలతో సతమతమైనా ముఖ్యమంత్రి అఖిలేశ్ పట్ల జనంలో సానుభూతి ఉంది. తండ్రి ములాయంతో పోరాడి పార్టీ గుర్తును దక్కించుకున్నారు. అయితే మళ్లీ తండ్రితోనే చేతులు కలపడం, కాంగ్రెస్‌తో జతకట్టడంతో జనంలో సానుభూతి తగ్గిపోయిందని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య అఖిలేశ్‌ను దెబ్బకొట్టి ఉండొచ్చని పేర్కొంటున్నారు.