కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ కార్యకర్తలు
జైపూర్/కోల్‌కతా: బీజేపీ జోరుకు రాజస్తాన్‌లో కళ్లెం పడింది. రాష్ట్రంలో రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలను, మండల్‌గఢ్ అసెంబ్లీ స్థానాన్ని అధికార బీజేపీ నుంచి చేజిక్కించుకుంది. అల్వార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌సింగ్ యాదవ్ సుమారు 2 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి జస్వంత్ యాదవ్‌ను ఓడిం చారు. అజ్మీర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రఘు శర్మ బీజేపీకి చెందిన స్వరూప్ లాంబాను 84 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. మండల్‌గఢ్ అసెంబ్లీ సీటును వివేక్ ధాకడ్ 13 వేల ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ ఏడాది రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
తృణమూల్ క్లీన్ స్వీప్...
పశ్చిమ బెంగాల్‌లో ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. హౌరా జిల్లాలోని ఉలుబెరియా సిట్టింగ్ ఎంపీ సుల్తాన్ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య టీఎంసీ అభ్యర్థి సాజ్దా అహ్మద్ బీజేపీకి చెందిన అనుపమ్ మల్లిక్‌ను 5 లక్షల ఓట్ల తేడాతో చిత్తు చేశారు. నోవాపరా అసెంబ్లీ సీటును కాంగ్రెస్ అవమానకర రీతిలో కోల్పోయింది. ఈ స్థానాన్ని టీఎంసీ అభ్యర్థి సునీల్ సింగ్ గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment