మోదీ హవాను ఆప్ అడ్డుకుంటుందా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి మోదీ, కేజ్రీవాల్‌లను కేంద్రంగా చేసుకునే జరుగనున్నాయి. 2013 ఎన్నికల సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ గ్రాఫ్ దూసుకెళ్లి ఎన్నికల ఫలితాలను శాసించింది. ప్రధాని నరేంద్రమోదీ హవా జాతీయ స్థాయిలో దాదాపుగా అదేసమయంలో ఊపందుకుంది. మోదీ, కేజ్రీవాల్‌ల వ్యక్తిగత ప్రతిష్ట స్థాయిలో నాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ నేత.. 49రోజులైనా పరిపాలన చేయలేక రాజీనామా చేయటంతో ఆయన గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. దాని పర్యవసానం దాదాపు ఏడాది పాటు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ కొంచెం కూడా పుంజుకోలేదు సరికదా.. నాయకత్వ లేమి ఆ పార్టీని వెంటాడుతోంది. దీంతో మరోసారి ఎన్నికలకు మోదీ, కేజ్రీవాల్‌లు కేంద్ర బిందువుగా మారారు. ఇద్దరూ కూడా ఇప్పటికే ఒకరికొకరు లక్ష్యంగా వాడివేడి ప్రచారాన్ని ప్రారంభించారు. గతవారం రామ్‌లీలా మైదానంలో మోదీ తొలి ఎన్నికల ప్రచార సభ మొత్తం కూడా ఆప్ లక్ష్యంగానే సాగింది. పరిపాలన ఎలా చేయాలో చేతకాని వాళ్లు, అరాచక వాదులుగా ఆప్ నేతలను మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏడాది పాటు ఢిల్లీలో ప్రభుత్వమనేది లేకుండా చేసిన వాళ్లను తీవ్రంగా శిక్షించాలనీ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్‌కు ఈ ఎన్నికలు రాజకీయ జీవిత పోరాటంగా మారాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తమను తేలిగ్గా తీసుకున్నాయని, అలాంటి సమయంలోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని.. ఇప్పుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నామని సోమవారం బెంగళూరులో కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ హవాను ఆప్ ఎంతవరకు ఆపగలుగుతుందో చూడాలి.
- సెంట్రల్ డెస్క్
బీజేపీ మిషన్ 60
ఈ విధానసభ ఎన్నికలు భారతీయ జనతాపార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకుని అతిపెద్దపార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి నాలుగు స్థానాల దూరంలో ఆగిపోవటం ఆ పార్టీకి నిరాశ కలిగించింది. అయితే, ఒకటిన్నర నెల కూడా అధికారంలో ఉండలేని కేజ్రీవాల్ స్వయంకృతం కమలనాథులకు కొంతమేరకు కలిసివచ్చే అంశం కావచ్చు. అందుకే 70 స్థానాల అసెంబ్లీలో ఏకంగా 60 స్థానాలు గెలుచుకోవాలన్న టార్గెట్‌తో వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీ కంటే కూడా మోదీ ఇమేజికి అత్యంత కీలకమని చెప్పవచ్చు. మోదీ హవాతో జమ్మూ, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరుస విజయాలతో ఉత్సాహంగా ఉండటంతో, ఢిల్లీలో గెలుపొందటానికి కూడా బీజేపీకి మోదీపై ఆధారపడటం మినహా మరోమార్గం లేదు. కనీసం 15 ర్యాలీలలోనైనా మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయంటేనే.. ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 2013లో బీజేపీ సీఎం అభ్యర్థి అయిన హర్షవర్ధన్ ఇప్పుడు కేంద్ర మంత్రి కావటంతో, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ సారథిగా మాకెన్
ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ ఢిల్లీలోనైనా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ అసలు బరిలో నిలబడటానికి ఆసక్తి కనపరచటం లేదు. కేంద్ర మాజీమంత్రి కపిల్‌సిబల్ కానీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్ కానీ ఏ ఒక్కరూ బరిలో నిలబడే అవకాశాలు లేవు. విచిత్రమేమంటే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయన పేరు కాంగ్రెస్ తొలిజాబితాలోనే ప్రకటించింది. ఇన్ని కష్టాల మధ్య ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ అజయ్ మాకెన్‌ను నియమించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమై 39మంది అభ్యర్థులతో రెండో జాబితాను సిద్ధం చేసింది. కృష్ణతీరథ్, మహాబల్ మిశ్రాలకు ఈ జాబితాలో చోటు దక్కినట్లు సమాచారం.
ఆనాటి క్రేజ్ ఇప్పుడు ఏది?
అవినీతిపై పోరాటం చేసిన టీమ్ అన్నాలో సభ్యుడిగా తొలి అడుగు వేసిన కేజ్రీవాల్.. 2012లో ఆమ్‌ఆద్మీపార్టీ స్థాపించి ‘క్రేజీ’వాల్‌గా మారిపోయారు. అదే సంవత్సరం డిసెంబర్ 16న నిర్భయ గ్యాంగ్‌రేప్ ఉదంతం, అడ్డగోలు విద్యుత్తు బిల్లులపై నిరాహార దీక్ష, మీడియా విపరీతమైన ప్రచారం నెలల కాలంలోనే కేజ్రీవాల్‌ను హీరోగా మార్చింది. ఆ దూకుడుతోనే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు గెల్చుకుని మొదట కింగ్‌మేకర్‌గా.. ఆ తరువాత కింగ్‌గా మారారు. డిసెంబర్ 28న మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత మంచినీరు వంటి పథకాలు అమలు చేశారు. తన మంత్రి సోమ్‌నాథ్‌భారతీ విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ విచిత్రంగా ముఖ్యమంత్రి హోదాలో నిరాహారదీక్షకు కూర్చున్న తొలి నేత కేజ్రీవాల్. జనలోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంలో విఫలమయి రాజీనామా చేయాల్సివచ్చింది. 2013 నాటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవన్నది వాస్తవం. మీడియాలో ఆయనకు ఆనాటి ప్రచారమూ లేదు. ఈ నేపథ్యంలో ఆప్ ఏ వ్యూహంతో అధికారంలోకి రాగలుగుతుందన్నది వేచిచూడాలి.