‘శ్రీకృష్ణ’ జోస్యమే నిజమైంది! | Sri Krishna Committee Prediction came true | Sakshi
Sakshi News home page

‘శ్రీకృష్ణ’ జోస్యమే నిజమైంది!

Published Thu, Aug 15 2013 12:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

‘శ్రీకృష్ణ’ జోస్యమే నిజమైంది! - Sakshi

‘శ్రీకృష్ణ’ జోస్యమే నిజమైంది!

ప్రస్తావన: వనరులు, జల, థర్మల్ విద్యుత్తు, సహజవాయువు, వ్యవసాయం తదితర రంగాలలో నెలకొని ఉన్న పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో చర్చించింది. 2000 సంవత్సరంలో ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాలు -  ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల పదేళ్ల నడక గురించి కూడా కొన్ని విషయాలు నమోదు చేసింది.
 
 రాష్ట్రాల విభజన లేదా పునర్‌వ్యవస్థీకరణ ముక్తకంఠంతో సాగేది కాదు. అభిప్రాయాలూ, అభ్యంతరాలూ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, సమన్వయం సాధించినప్పుడే ఆచరణలో ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది. ప్రత్యేక తెలంగాణ ప్రకటనకు ముందు యూపీఏ ప్రభుత్వం ఈ కీలకాంశాన్ని పట్టించుకోలేదా? సీమాంధ్ర అలజడులను కేంద్రం ఊహించలేదా? మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ పబ్బంగడుపుకునే రాజకీయ క్రీడేనా? విభజన నిర్ణయం ఏకపక్షంగా, తొందరపాటుగా జరిగిందనే వాదనలకు ప్రస్తుత పరిణామాలన్నీ బలం చేకూరుస్తు న్నాయి. తగినంత ఆలోచన, యోజన తరువాతే కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించిందని చెప్పడానికి దాఖలాలు లేవు.
 
 విభజన ప్రకటన అనంతరం తలెత్తే పరిణామాలను గురించి కేంద్రం ఇంతవరకు ఆలోచించలేదన్నా సత్యదూరం కాదు. విభజన నిర్ణయం తరువాత చేయవలసిన పనులు, తీసుకోవలసిన నిర్ణయాలకు సంబంధించిన అంశం శ్రీకృష్ణ కమిటీ పరిశీలనాంశం కాదు. విస్తృత అధ్యయనం, పరిశీలన, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం జరిగిందని రెండు రోజుల క్రితం రాజ్యసభలో జరిగిన చర్చలో చిదంబరం చెప్పారు. కానీ ఆ మాటకు విశ్వసనీయత లేదు. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? తాను చేసిన ఆరు సిఫార్సులలో దేనికి అగ్రస్థానం ఇచ్చింది? విభజన నిర్ణయంలో తొందరపాటు ఉందని ప్రతిపక్షాలు, సీమాంధ్ర ప్రజలు ఆరోపిస్తున్న తరుణంలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన మార్గాలు ఏమిటో ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం.
 
 ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచి, తెలంగాణ రాజకీయ సాధికారత, సామాజికాభివృద్ధి ధ్యేయంగా ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. రాజ్యాంగబద్ధమైన భద్రత కల్పించాలన్నది చివరి సిఫార్సు ఉద్దేశం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనన్న అభిప్రాయంతో కమిటీ ఈ సిఫార్సు చేసింది. కమిటీ ఈ సిఫార్సుకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలకు విభజన పరిష్కారంకాదని, ఐక్యంగా ఉండటమే మంచిదని కమిటీ చెప్పింది.
 
 శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో ఒక మలుపు. శ్రీకృష్ణ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మీద సంప్రదింపుల కమిటీని 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ప్రొఫెసర్ రణ బీర్‌సింగ్, డాక్టర్ అబూసలే షరీఫ్, రవీందర్ కౌర్, వినోద్ కె.దుగ్గల్ సభ్యులుగా ఉన్నారు. 2010, డిసెంబర్ 30న కమిటీ తన 461 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పిం చింది. 2011, జనవరి 6న నివేదికను కేంద్రం రాష్ట్ర ప్రజల ముందుంచింది.
 
 శ్రీకృష్ణ కమిటీ క్షేత్ర పర్యటనలలో, అన్ని ప్రాంతాల ప్రజల, ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రాతిపదికపై సిఫార్సులు చేసింది. స్త్రీలు, విద్యార్థులు, మైనారిటీ వర్గాలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఉద్యోగులు, వ్యక్తులు - అందరి మనోగతాలను స్వీకరించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా? లేక యథాతథస్థితిని కొనసాగించాలా? అనే అంశాన్ని పరిశీ లించడమే ఈ కమిటీకి అప్పగించిన బాధ్యత. మరో ఆరు అంశాలు కూడా ఈ కమిటీ పరిధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత మూడు ప్రాంతాలపై విభజన ప్రభావాన్ని, జరిగిన అభివృద్ధి తీరుతెన్నులను సమీక్షించ డం మరొకటి. రాష్ట్రంలో అప్పటివరకు జరిగిన పరిణామాల ప్రభావం వివిధ వర్గాల మీద ఎలా పడిందో పరీక్షిం చడం, ఈ పరిణామాలపై రాజకీయపార్టీల, ప్రజాసం ఘాల అభిప్రాయాలను సేకరించడం, వీటికి పరిష్కారాలు చూపించడం, కార్యాచరణను సూచించడం, మూడు ప్రాం తాల సమగ్రాభివృద్ధికి ప్రజలు, సంస్థలు వెలిబుచ్చిన అభిప్రాయాలు నమోదు చేసుకోవడం, అర్హమైనవని భావిం చిన స్వీయ అభిప్రాయాలు వెల్లడించడం వంటివి కమిటీ పరిధిలో ఉన్నాయి.
 
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికీ, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయానికీ లోతైన భూమిక ఉంది. అందుకే శ్రీకృష్ణ కమిటీ ఆ నేపథ్యాన్ని వివరించడానికి నివేదికలో చాలా స్థలం కేటాయించింది. చాలా చారిత్రక వాస్తవాలు, వాటిని నిర్దేశించిన నాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన అంశాలను సుస్పష్టంగా కమిటీ వెల్లడించింది. 1953 డిసెంబర్‌లో నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, 2010 ఆగస్టులో లక్నో కేంద్రంగా ‘చిన్న రాష్ట్రాల జాతీయ సమాఖ్య’ ఏర్పడటం వరకు చర్చించింది. వనరులు, జల, థర్మల్ విద్యుత్తు, సహజవాయువు, వ్యవసాయం తదితర రంగాలలో నెల కొని ఉన్న పరిస్థితిపై కమిటీ తన నివేదికలో చర్చించింది. 2000 సంవత్సరంలో ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాలు - ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్‌ల పదేళ్ల నడక గురించి కూడా కొన్ని విషయాలు నమో దు చేసింది.
 
 ఇందులో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ గిరిజనాభ్యుదయమే లక్ష్యంగా ఆవిర్భవించిన రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల ఏర్పాటే దేశంలో ఇంకొన్ని చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న 2010, సెప్టెంబర్‌లోనే చిన్న రాష్ట్రాల జాతీయ సమాఖ్య సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. గూర్ఖాలాండ్ (పశ్చిమ బెంగాల్), బోడోలాండ్ (అసోం), విదర్భ (మహారాష్ట్ర), బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, హరితప్రదేశ్ (ఉత్తరప్రదేశ్), లదాక్, జమ్మూ (జేకే) రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాలూ, అభిప్రాయాలూ పదునెక్కుతున్న నేపథ్యాన్ని కూడా శ్రీకృష్ణ కమిటీ వివరించింది. 1953 నాటి ఎస్సార్సీ ముందు తెలంగాణ ప్రాంత నాయకులు చేసిన వాదనలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఉన్న సానుకూలత, ప్రతికూలతలపై కూడా ఎలాంటి శషభిషలు లేకుండా శ్రీకృష్ణ వివరించారు. గత, వర్తమాన రాజకీయ పరిస్థితుల ఆధారంగా కమిటీ ఆరు సిఫార్సులు చేసింది.
 
 యథాతథస్థితి కొనసాగింపు
  గడచిన ఐదున్నర దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకోవచ్చు. పూర్తిగా శాంతి భద్రతల కోణం నుంచి దీనిని అమలు చేయవలసి ఉంటుంది. దీనిని అమలు చేయదలుచుకుంటే కేంద్రం జోక్యం తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రతిపాదన చేయడానికి కారణం, గతంలో జరిగిన పోరాటాల రూపురేఖలు. గతంలో తెలంగాణ అంశం ఎప్పుడు రాజుకున్నా ఆయా వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ రాజకీయంగానే ఆ డిమాండ్‌ను కేంద్రం ఎదుర్కొంటూ వచ్చింది. తెలుగు ఆత్మగౌరవ నినాదం తెరపైకి వచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ డిమాం డ్ సమసిపోలేదు. పాత కారణాలతో, కొత్త సమీకరణలతో 2000 సంవత్సరంలో మరోమారు తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమరూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటి పెద్ద మనుషుల ఒప్పందం, ఉద్యోగులకు సంబంధించి 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సరిగ్గా అమలు కాకపోవడం, ప్రాంతీ యంగా విద్యా ప్రమాణాలలో హెచ్చుతగ్గులు, నీటి వనరులలో వివక్ష, ఆర్థికాభివృద్ధిపై అలక్ష్యం వంటి అంశాల ప్రాతిపదికపై తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదం ఊపందుకుంది. అయితే ఈ సిఫార్సు అమలు అప్పటికి నెలకొని ఉన్న పరిస్థితులలో సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఏ చర్యలూ తీసుకోకుండా యథాతథ పరిస్థితిని కొనసాగించడం సాధ్యం కాదని, ఇదే జరిగితే ఆందోళన ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని కూడా నివేదికలో పేర్కొన్నారు. అందుకే ఒకవైపు యథాతథస్థితిని ఉన్నం తలో ఉత్తమ పరిష్కారంగా భావిస్తూనే మరోవైపు అన్ని సిఫార్సులకన్నా అత్యల్ప ప్రాధాన్యం ఉన్న సిఫార్సుగా దీనిని కమిటీ అభివర్ణించింది.
 
 కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్
 ప్రస్తుత రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటించి, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం, కొత్త రాష్ట్రాలు తమ తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వడం ఈ సిఫార్సు సారాంశం. ఈ ప్రతిపాదన చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కమిటీ ఇలా వివరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి సంస్కృతి ఉంది. దేశంలో ఏర్పాటైన తొలి భాషాప్రయుక్త రాష్ట్రం. ఒకే నగరం కోసం రెండు వర్గాలు పోటీపడినప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం యోచనే మంచిది. అంటే ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే మంచిదన్నది కమిటీ అభిప్రాయం. అయితే కొత్త రాష్ట్రాలు సొంత రాజధానులను అభివృద్ధి చేసుకునే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనీ, హైదరాబాద్ రాజధానిగా కొనసాగాలనీ వాంఛిస్తున్నారు. అయితే వేరే రాష్ట్రంలో ఉన్న రాజధానిలో తమ పెట్టుబడులకు, ఆస్తులకు రక్షణ ఉండదన్న అనుమానాలు కూడా వారికి సహజం. ఈ సిఫార్సు హైదరాబాద్ ప్రాధాన్యాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది. అంతర్జాతీయంగా ఈ నగరానికి ప్రత్యేకత ఉంది. దీనిని వృద్ధికి చోదకశక్తిగా గుర్తిస్తున్నారు. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయి. పక్కన రంగారెడ్డి జిల్లా ఉండటం తో కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడులు కూడా వచ్చాయి. ఈ ఆర్థికవృద్ధి నిలకడగా ఉంటేనే ఉద్యోగావకాశాలు కొనసాగుతాయి. కానీ తెలంగాణ పరిస్థితి దృష్ట్యా ఇది కూడా ఆచరణయోగ్యం కాని ప్రతిపాదనగానే కమిటీ తేల్చింది.
 
 రాయల తెలంగాణ ఏర్పాటు
 ఆంధ్రప్రదేశ్‌ను రాయల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలుగా విభజించడం, హైదరాబాద్‌ను రాయలతెలంగాణలో అంతర్భాగంగా ఉంచడం ఈ ప్రతిపాదన ఉద్దేశం. సీమలో కొన్నివర్గాలు ఈ ప్రతిపాదనను రెండో అభిమతంగా ఆహ్వానించాయని కమిటీ చెప్పింది. తొలి ప్రాధాన్యం మాత్రం సమైక్య ఆంధ్రకే. హైదరాబాద్‌లో బలంగా ఉన్న ఎంఐఎం కూడా దీన్ని రెండో అభిమతంగా పేర్కొనడం విశేషం. ఆ పార్టీ ఉద్దేశం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఒకవేళ విభజన అనివార్యమైతే మాత్రం రాయల తెలంగాణకు సముఖంగా ఉన్నట్టు పేర్కొన్నది. తెలంగాణ, సీమ లు కలిస్తే జనాభా దృష్ట్యా ముస్లింలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అంచనా. అయితే, మీరు తెలంగాణలో ఉంటారా? కోస్తాంధ్రలో ఉంటారా? అని అక్కడి ప్రజలను అడిగితే వారు తెలంగాణవైపే మొగ్గుతారని కమిటీ చెప్పిం ది. అంతగా సీమ తెలంగాణ మీద ఆధారపడి ఉంది. అయితే ఈ ప్రతిపాదనను ఎవ్వరూ ఆమోదించలేదు. ముఖ్యంగా తమ వెనుకబాటుకు కారణం సీమ నేతలేనని తెలంగాణలో కొన్ని వర్గాల అభిమతం. రాయల తెలంగాణ వల్ల కొన్ని ఛాందసవాద శక్తులు బలం పుంజుకుంటాయనే అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేశారు.
 
 విభజన, కేంద్రపాలనలో ‘గ్రేటర్’
 రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విస్తరిం పచేయాలని ఈ ప్రతిపాదన చెబుతోంది. రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధిలో కూడా హైదరాబాద్ పాత్ర కీలకమని కమిటీ అభిప్రాయం. అందుకే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను కూడా కలిపి 67 మండలాలు, 1,330 గ్రామాలతో, 12,430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కేంద్రపాలిత ప్రాంతంగా నిర్మించాలని కమిటీ అభిప్రాయం. ఇది గోవా పరిధికి రెట్టింపు. వ్యూహా త్మకంగా కూడా హైదరాబాద్ కీలకమే. అందుకే కేంద్రపాలిత ప్రాంతం చేయడం అవసరమని కమిటీ చెప్పింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూనే ఇది తెలంగాణ, సీమాంధ్రలకు రాజధానిగా ( హర్యానా, పంజాబ్‌లకు చండీగఢ్ రాజధాని అయినట్టు) ఉంచాలి. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రజానీకం ఆమోదించదని కమిటీ పేర్కొన్నది.
 
 హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ
 ప్రస్తుత సరిహద్దుల ప్రకారం రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాం ధ్రలుగా విభజించి, తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిని చేయాలి. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిఫార్సును పరిగణనలోనికి తీసుకోవచ్చునని కమిటీ అభిప్రాయం. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమం పూర్తిగా కొట్టిపారేయలేనిది కాదని కమిటీ అంచనా. ఇం దువల్ల ఆంధ్ర, సీమల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి అభ్యంతరాలు ఉంటే, వాటిని పరిష్కరిం చాలి. కానీ ఈ ప్రతిపాదన తెలంగాణలో ఎక్కువ ప్రాం తాల వారిని సంతృప్తిపరిచినా, దేశంలో కొత్త సమస్యలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది. ఈ పూర్వాపరాలను పరిశీలించిన తరువాత ఈ సిఫార్సుకే తొలి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.
 
 అయితే తన ద్వితీయ ప్రాధాన్యం ఈ సిఫార్సుకే ఇచ్చింది. ఈ సిఫార్సును చేయడమంటే మెజారిటీ ప్రజల అభిమతాన్ని గుర్తించడమేనని కూడా కమిటీ అభిప్రాయం. ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించదలుచుకుంటే పరిణామాలు ఉగ్రరూపం దాలుస్తాయని, జలవనరులు, విద్యుత్ సమస్యలు తెర మీదకు రావడం, సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, ఆందోళనలను ఎదుర్కొనవలసివస్తుందని కమిటీ చెప్పింది. ఆలోచించదగ్గదే అయినా ఈ సిఫార్సు అమలుకు నిర్ణయిస్తే తెలంగాణలో మతోన్మాదం, నక్సలిజం పెరిగే ఆస్కారముందని కూడా హెచ్చరించింది. విభజన ఆలోచన అనివార్యమని భావిస్తే, మూడు ప్రాంతాల మధ్య సుహృద్భావ పరిస్థితులు నెలకొల్పి అమలుచేయాలని కూడా భావించింది.
 
 తెలంగాణకు ప్రాంతీయ మండలి
 ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచి, తెలంగాణ రాజకీయ సాధికారత, సామాజికాభివృద్ధి ధ్యేయంగా ప్రాంతీయ మండలి ఏర్పాటుచేయాలి. రాజ్యాంగబద్ధమైన భద్రత కల్పించాలన్నది చివరి సిఫార్సు ఉద్దేశం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనన్న అభిప్రాయం తో కమిటీ ఈ సిఫార్సు చేసింది. కమిటీ ఈ సిఫార్సుకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలకు విభజన పరిష్కారంకాదని, ఐక్యంగా ఉండటమే మంచిదని కమిటీ చెప్పింది. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పం దం మేరకే తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి తగిన నిధులు సమకూర్చాలి. తెలంగాణ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలు, జలవనరులు, నీటి పారుదల, విద్య, ఆరోగ్యం వంటివి మండలి పరిధిలో ఉంటాయి. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడమే ఈ సిఫార్సు ధ్యేయం.
 
 ఈ కమిటీని తెలంగాణవాదులు ఎవరూ సమర్థించలేదు. కొన్ని పార్టీలు మాత్రం కమిటీ సిఫార్సులకు కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. తెరాస అధిపతి కేసీఆర్ కమిటీ పరిశీలనాంశాలనే అర్థరహితమని విమర్శించారు. అలాగే తెలంగాణ వెనుకబడి ఉందన్న తెరాస వాదనను కమిటీ పూర్వపక్షం చేసింది. గతంలో ఈ ప్రాంతం వివక్షకు గురైన మాట నిజమే అయినా 1971 తరువాత పరిస్థితి మెరుగుపడిందని వాదించింది. రాయలసీమ తెలంగాణ కంటె వెనుకబడి ఉందని స్పష్టం చేసింది.
 ఎడిట్ పేజీ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement