క్రైస్తవుల ఓట్ల కోసం బీజేపీ సరికొత్త వ్యూహం | Is BJP plan to repeal Arunachal Pradesh’s anti-conversion law? | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల ఓట్ల కోసం బీజేపీ సరికొత్త వ్యూహం

Published Mon, Jul 9 2018 4:37 PM | Last Updated on Mon, Jul 9 2018 4:53 PM

Is BJP plan to repeal Arunachal Pradesh’s anti-conversion law? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు పాల్పడకుండా నిరోధించేందుకు 1978లో మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మూడవ రాష్ట్రం అరుణాచల్‌. అంతకుముందు 1967లో ఒరిస్సాలో, 1968లో మధ్యప్రదేశ్‌లో తీసుకొచ్చారు. స్థానిక మతాలను, వారి సంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతోనే అరుణాచల్‌లోనూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లోగానే దీన్ని మత మార్పిడిల వ్యతిరేక లేదా నిరోధక చట్టం అనకుండా ‘అరుణాచల్‌ ప్రదేశ్‌ మత స్వేచ్ఛా చట్టం’ అని నామకరణం చేశారు. బలవంతంగా, ప్రోద్బలంతో లేదా మరే ఇతర తప్పుడు మార్గాల ద్వారా ఒక మతం నుంచి మరో మతంలోకి ప్రజలను తీసుకోరాదని చట్టం నిర్దేశిస్తోంది.

క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో రాష్ట్రంలో వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోందని, న్యీషి, డోన్యీ–పోలో, రంగ్‌ఫ్రా, గ్యాటీ అండా, అమిక్‌ మతాయ్‌.. స్థానిక జాతులు లేదా మతాల ప్రాభవం తగ్గి, అవి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్న కారణంగా నాడు మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. 1971లో అరుణాచల్‌ రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య జనాభాలో ఒక శాతం ఉండగా, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 30 శాతానికి చేరుకుంది. అదే 51.6 శాతం ఉన్న స్థానిక మతాల ప్రజల సంఖ్య 26 శాతానికి పడిపోయింది, మత మార్పిడుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయక పోవడం వల్ల రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

ఈ పరిస్థితుల్లో, చట్టం వచ్చిన 40 ఏళ్ల అనంతరం తమ బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేయాలనుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖందు ఇటీవల ప్రకటించడం ప్రజా వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రైస్తవుల పట్ల వివక్ష చూపుతున్న ఈ చట్టం నిజమైన లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. మంచి విద్యను, మంచి వైద్యాన్ని అందిస్తామన్న హామీతోనే స్థానికంగా క్రైస్తవ మతం ఎదిగిందని ‘అరుణాచల్‌ తెగల అధ్యయన సంస్థ’కు చెందిన జుమ్యిర్‌ బసర్‌ తెలిపారు. సంప్రదాయబద్ధమైన చికిత్సా విధానంపైనా ప్రజలకు పెద్దగా నమ్మకం లేకుండా పోయిందని, పైగా ఆ వైద్యంలో ఖర్చుతో కూడుకున్న సంప్రదాయాలున్నాయని ఆమె వివరించారు.

స్థానిక ప్రజలు ప్రోద్బలంతో తమ మతంలోకి రాలేదని, తమ మతాన్ని మనస్ఫూర్తిగా నమ్మి వచ్చారని అరుణాచల్‌ క్రైస్తవ సంస్థకు చెందిన టొకో టెకీ చెప్పారు. రాజ్యాంగం లౌకికవాద స్ఫూర్తికి భిన్నంగా ఉన్న చట్టాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం వివేకమైన నిర్ణయమని టెకీ వ్యాఖ్యానించారు. ఎప్పటి నుంచో ఈ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్న క్రైస్తవ సంఘాల సభ్యుల్లో ఆయన ఒకరు. చట్టం ప్రకారం మత మార్పిడులు జరుగ కూడదుగానీ స్థానిక ప్రజలు కైస్తవాన్ని జీవన విధానంగా ఎంపిక చేసుకున్నారని ‘అరుణాచల్‌ చర్చి పునురుద్ధణ మండలి’ అధ్యక్షుడు న్యాక్డో టాసర్‌ వ్యాఖ్యానించారు. 1970 చివర్లో, 1980 మొదట్లో కొన్ని సార్లు మాత్రమే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని వినియోగించారని, ఆ తర్వాత ఎప్పుడూ లేదని అరుణాచల్‌ యూనివర్శిటీలో చరిత్రను బోధించే అధ్యాపకుడు నాని బాత్‌ తెలిపారు.

చట్టాన్ని ఎత్తివేస్తే అడ్డూ అదుపూ లేకుండా మత మార్పిడులు పెరిగిపోతాయని స్థానిక మతం న్యీషి సాంస్కృత సంఘానికి చెందిన పై ధావే ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లను దృష్టిలో పెట్టుకొనే చట్టాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. సహజంగా బీజేపీకి క్రైస్తవులు వ్యతిరేకులు. వారి డిమాండ్‌ను అంగీకరించడం ద్వారా వారి మద్దతును కూడగట్టవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా పనిచేస్తున్న ఆరెస్సెస్‌ న్యాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మతాల పిల్లల పాఠశాలలకు, సాంస్కృతిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ద్వారా వారిని హిందూమతంలోకి తీసుకరావడానికి ఆరెస్సెస్‌ కార్యకర్తలు కృషి చేస్తున్నారు.

1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 22 శాతం మంది హిందువులు ఉండగా, 2011 నాటికి వారి సంఖ్య 29 శాతానికి పెరిగింది. ఓ దశలో బాగా పెరిగిన హిందువుల సంఖ్య సామాజిక అంతరాల వైషమ్యాల కారణంగా పడిపోయింది. అరుణాచల్‌ తర్వాత మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాలు తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement