సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును సోమవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో జన్మభూమి కమిటీలు చేస్తోన్న అక్రమాలను బయటపెట్టేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెన్షన్ల జారీలో అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విసిరిన సవాలును స్వీకరించిన అంబటి.. ఈ మేరకు చర్చకోసం బయలుదేరగా.. అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. అంబటి హౌస్ అరెస్ట్ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు.
దమ్ముంటే చర్చకు రండి : ‘‘పెన్షన్లలో అక్రమాల విషయమై ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నేను చేసిన ఆరోపణలు తప్పని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాలు విసిరారు. నేను కూడా సిద్ధమేనని చెప్పాను. సోమవారం ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి సెంటర్‌లో చర్చ జరగాల్సిఉంది. కానీ నన్ను అక్కడికి వెళ్లనీయకుండా టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంది. హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అసలు పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించేవాళ్లు అసలు సవాలెందుకు చేసినట్లు? ఇప్పటికైనా దమ్ముంటే చర్చకు రావాలి. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ బండారం మొత్తం బయటపెడతా’’ అని రాంబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment