వచ్చాడయ్యో సామీ.. గుర్రమెక్కి! | Political Leader Nomination Rally On Horse Ride Like Groom | Sakshi
Sakshi News home page

వచ్చాడయ్యో సామీ.. గుర్రమెక్కి!

Published Wed, Apr 10 2019 11:02 AM | Last Updated on Wed, Apr 10 2019 11:02 AM

Political Leader Nomination Rally On Horse Ride Like Groom - Sakshi

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. అందరిలా సాదాసీదాగా నామినేషన్‌ దాఖలు చేయడంలో కొత్తదనం ఏముందని అనుకున్నాడో ఏమో ఉత్తరప్రదేశ్‌లో బాజా భజంత్రీలతో పెళ్లి దుస్తులు వేసుకొని గుర్రమెక్కాడు ఓ అభ్యర్థి. బ్యాండు మేళం.. పెళ్లి ఊరేగింపూ.. దానికి ముందు దుమ్మురేపుతోన్న కుర్రకారు డాన్సులు.. ఇంత హంగామాతో యూపీలోని షాజహాన్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళుతోన్న సంయుక్త్‌ వికాస్‌ పార్టీ అభ్యర్థి వైద్‌ రాజ్‌ కిషన్‌ని అధికారులు అడ్డుకున్నారు. సిటీలో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపుతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఈ అభ్యర్థి వెళుతుండడంతో అధికారులు అడ్డగించి గుర్రం నుంచి దింపేశారు.

‘ఏమిటీ వేషం?’ అని అడిగితే, ఈ రోజు తన పెళ్లి రోజు కావడం వల్ల పెళ్లి దుస్తులైన షేర్వాణీ,తలపాగా ధరించి, గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వెళ్లానని చెప్పారు. ఈ ఊరేగింపుని సదర్‌బజార్‌లో అడ్డుకున్న అధికారులు మధ్యలోనే గుర్రం దించేయడంతో, సదరు అభ్యర్థి కలెక్టరేట్‌కి నడిచి వెళ్లి, నామినేషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే కిషన్‌ ఇలా సరికొత్తగానామినేషన్‌ దాఖలు చేయడం ఇదే కొత్త కాదనీ, 2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఈయన గారు ఇలాగే ఊరేగింపుగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే, అప్పుడు చావు ఊరేగింపు మాదిరిగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement