హిట్.. హిట్.. హుర్రే..! | All you need to know about first-ever day-night Test | Sakshi
Sakshi News home page

హిట్.. హిట్.. హుర్రే..!

Published Tue, Dec 1 2015 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

తొలి డే నైట్ టెస్టుకు ఆతిథ్యమిచ్చిన అడిలైడ్ మైదానం

తొలి డే నైట్ టెస్టుకు ఆతిథ్యమిచ్చిన అడిలైడ్ మైదానం

ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టెస్టు మ్యాచ్‌లకు ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు.  ఏ దేశంలో ఆడినా ప్రేక్షకులు బాగానే ఉంటారు. ఇక యాషెస్ సిరీస్ అయితే పోటెత్తుతారు. కాబట్టి డేనైట్ టెస్టు క్రికెట్‌కు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంలో ఆశ్చర్యం లేకపోయినా... మూడు రోజుల్లో ఏకంగా లక్షా 23 వేల 736 మంది మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడ టం కచ్చితంగా గొప్ప విషయమే. అంతేకాదు... ఈ టెస్టుకు ప్రపంచ వ్యాప్తంగా టీవీ రేటింగ్స్ కూడా విశేషంగా వచ్చాయి. దీంతో ఐసీసీ ఆనందంలో మునిగింది. డేనైట్ మ్యాచ్‌లను మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉంది.
 
 డేనైట్ టెస్టు ప్రయోగం విజయవంతం  
* మరిన్ని మ్యాచ్‌ల ఆలోచనలో ఐసీసీ
 సాక్షి క్రీడావిభాగం: టి20ల మాయలో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భారత్, పాకిస్తాన్ లేదా యాషెస్ సిరీస్‌కు తప్ప మిగిలిన ఏ దేశాల మధ్య టెస్టులు జరిగినా ప్రేక్షకులు రావడం లేదు. క్రికెట్‌ను విపరీతంగా ప్రేమించే భారత్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులే లేరు.

పాఠశాల పిల్లలను ఉచితంగా స్టేడియాలకు తీసుకొచ్చినా కనీసం నాలుగు వేల మందిని కూడా స్టేడియానికి రప్పించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య అడిలైడ్‌లో జరిగిన టెస్టుకు వచ్చిన ఆదరణ అమోఘం. స్టేడియానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో పాటు టీవీల్లో ఈ మ్యాచ్‌ను విశేషంగా చూశారు. ఒక్క ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆఖరి రోజు రాత్రి 32 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. ఇటు భారత్‌లోనూ ఇది పూర్తిగా పగటి పూట రావడంతో వీక్షకులు సంఖ్య బాగానే ఉంది.
 
వచ్చే ఏడాది మరో రెండు
తొలిసారి తమ దగ్గర నిర్వహించిన డేనైట్ మ్యాచ్ విజయవంతం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ఉత్సాహంలో ఉంది. వచ్చే ఏడాది తమ సీజన్ ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టును డేనైట్‌గా నిర్వహించాలని భావిస్తోంది. అలాగే పాకిస్తాన్‌తో కూడా ఓ టెస్టు పింక్ బంతితో ఆడాలనే ప్రతిపాదన చేస్తున్నారు. అటు ఐసీసీ కూడా అన్ని బోర్డులనూ ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది.  
 
సమస్యలు లేవా?
పింక్ బంతితో మ్యాచ్‌లు ఆడటం వల్ల సమస్యలు పెద్దగా లేవు. లైట్ల వెలుతురులో ఈ బంతి  మైదానంలో వెళుతుంటే మరింత ఆహ్లాదంగా ఉంది. కాబట్టి బంతి రంగు విషయంలో ఇన్నాళ్ల కష్టం ఫలించినట్లే. అయితే పింక్ బంతి ఎరుపు బంతులతో పోలిస్తే త్వరగా మెత్తబడుతోందనే ఫిర్యాదు ఒకటుంది. దీనితో పాటు సాయం సమయంలో కాస్త ఇబ్బందిగా ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లు చెబుతున్నారు.

సూర్యాస్తమయం జరుగుతున్న సమయంలో... లైట్ల ప్రభావం పూర్తిగా రాకముందు ఒక గంట పాటు బ్యాటింగ్ క్లిష్టంగా ఉందని అంటున్నారు. కాబట్టి బంతి తయారీదారులు దీనికి పరిష్కారాన్ని వెతకాల్సి రావచ్చు. అలాగే పింక్ బంతి కోసం పచ్చిక ఎక్కువగా ఉండేలా పిచ్‌ను రూపొం దించారు. దీనివల్ల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగి సింది. ఇలాంటి పిచ్ మీద ఆడటం ఉపఖండం జట్లకు చాలా కష్టం. అయితే అంత పచ్చిక లేకున్నా సమస్య లేదని ఆస్ట్రేలియా కోచ్ లీమన్ అంటున్నారు.
 
ఇంకా ప్రయోగాలు చేయాలి
రాత్రి పూట టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా బంతిని తయారు చేసేందుకు కూకాబూరా కంపెనీ పదేళ్లు కష్టపడింది. రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత తొలి మ్యాచ్ జరిగింది. అయితే వచ్చే ఏడాది కాలంలో ఈ బంతిని మరింత మెరుగుపరచాలని క్రికెటర్లు కోరుతున్నారు.  ఏమైనా క్రికెట్ చరిత్రలో ఇదో పెద్ద మలుపనే అనుకోవాలి.

టి20లు వచ్చాక, ఆటలో వేగం పెరిగి... రోజంతా కూర్చుని మ్యాచ్‌లు చూసే ఓపిక అభిమానులకు తగ్గిపోయింది. రాత్రి పూట మ్యాచ్‌లు చూడటం ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అయితే ఉపఖండంలోని పిచ్‌లపై ఈ బంతితో ఆడటం కష్టమని నిర్వాహకులే చెబుతున్నారు. కాబట్టి ఈ విజయవంతమైన ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలంటే ఐసీసీ కూడా భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement