న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే టూర్‌లో భాగంగా జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను విశాఖపట్నంకు కేటాయించారు. శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో బీసీసీఐ ఫిక్స్చర్స్ కమిటీ సిరీస్ వేదికలను ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో ఇరు జట్ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు జరుగుతాయి. హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో గతంలో మూడు టెస్టులు మ్యాచ్‌లు జరిగాయి.
2013 మార్చిలో ఆఖరి సారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ నిర్వహించారు. మరో వైపు వరుసగా మూడో సారి కూడా విశాఖ మైదానం వెస్టిండీస్ ఆడే వన్డే మ్యాచ్‌కే వేదిక కానుండటం విశేషం. ఈ సిరీస్‌లో మరో రెండు టెస్టులు బెంగళూరు, అహ్మదాబాద్‌లలో జరగనుండగా...ఇతర వన్డేలకు కోల్‌కతా, కటక్, ధర్మశాల, కొచ్చి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.