జీసీఏ అధ్యక్షునిపై బీసీసీఐ వేటు
న్యూఢిల్లీ:ఇటీవల అవినీతి ఆరోపణలపై అరెస్టైన గోవా క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) అధ్యక్షుడు చేతన్ దేశాయ్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శనివారం సస్పెండ్ చేసింది. అతనితో పాటు జీసీఏ కార్యదర్శి వినోద్ ఫడ్కేను కూడా సస్పెండ్ చేసింది. బీసీసీఐ మార్కెటింగ్ కమిటీకి దేశాయ్ చైర్మన్ గా ఉండగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మేనేజ్మెంట్ ప్యానెల్ లో ఫడ్కే సభ్యుడిగా ఉన్నారు. ఈ పదవుల నుంచి కూడా వారిని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ వారికి బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
2006-07లో బీసీసీఐ నుంచి వచ్చిన రూ. 3.13 కోట్ల చెక్కును నకిలీ అకౌంట్ ఖాతా సృష్టించి సొమ్ము చేసుకున్నారనేది వారిపై వెలుగుచూసిన ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణంలో భాగంగా ఇటీవల చేతన్ దేశాయ్, వినోద్ ఫడ్కేలతో పాటు, జీసీఏ ట్రెజరర్ అక్బర్ ముల్లాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.