బెన్ స్టోక్స్ కు రికార్డు ధర
ముంబై: ఇంగ్లండ్ జట్టులో సంచలన క్రికెటర్గా గుర్తింపు పొందిన బెన్ స్టోక్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 వేలంలో జాక్ పాట్ కొట్టాడు. ఈ వేలంలో స్టోక్స్ కు రూ.14.5 కోట్ల రికార్డు ధర పలికింది. గతేడాది ఐపీఎల్లోకి ప్రవేశించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ స్టోక్స్ కు భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. కనీస ధర రెండు కోట్లు ఉన్న స్టోక్స్ ను దక్కించుకోవడానికి పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే స్టోక్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలని పుణె మొండి పట్టుదలను ప్రదర్శించడంతో అతనికి ఎక్కువ మొత్తం లాభం చేకూరింది. 6 లేదా 7 స్థానాల్లో దూకుడుగా ఆడటంతో పాటు పేస్ బౌలర్‌గా సత్తా కలిగిన ఆటగాడు స్టోక్స్. ఇటీవల భారత్‌తో సిరీస్‌లో స్టోక్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకోవడం కూడా అతన్ని భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణమైంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా స్టోక్స్ గుర్తింపు సాధించాడు. ఆ క్రమంలోనే షేన్ వాట్సన్(9.5 కోట్లు)ను స్టోక్స్ అధిగమించాడు.
ఇదిలా ఉంచితే, గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు పవన్ నేగీకి మాత్రం ఈసారి కోటి రూపాయిలకే పరిమితమయ్యాడు. ఈ సీజన్ లో పవన్ నేగీ కనీస ధర రూ. 30 లక్షలు కాగా, అతనికి రూ. కోటి దక్కడం ఇక్కడ విశేషం పవన్ నేగీనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయిలు చెల్లించి దక్కించుకుంది. పవన్ నేగీ కోసం పుణె సూపర్ జెయింట్స్ -గుజరాత్ లయన్స్ లు పోటీ పడినప్పటికీ, చివరకు బెంగళూరు అతన్ని దక్కించుకుంది. మరొకవైపు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు రెండు కోట్లు పెట్టి కింగ్స్ పంజాబ్ దక్కించుకోగా, శ్రీలంక క్రికెటర్ ఏంజెలా మాథ్యూస్ ను రెండు కోట్లు చెల్లించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ అండర్సన్ ను కూడా ఢిల్లీని దక్కించుకోవడం విశేషం. అతనికి రెండు కోట్లు చెల్లించిన ఢిల్లీ దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ వేలం కొనసాగుతోంది.