తైమాల్ మిల్స్ జాక్పాట్
ముంబై:ఈసారి వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ల పంట పండింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను 14.5 కోట్లు పెట్టి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కొనుగోలు చేస్తే, ఆ దేశానికే చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తైమాల్ మిల్స్ సైతం జాక్ పాట్ కొట్టాడు. కేవలం నాలుగు అంతర్జాతీ ట్వంటీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న మిల్స్ ను కు రూ.12 కోట్లు చెల్లించి మరీ రాయల్ ఛాలెంజర్స్ బెంగూళురు దక్కించుకుంది. అతను ఎడమ చేతి బౌలర్ కావడంతో పాటు బౌలింగ్ లో వైవిధ్యం ఉండటమే భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేయడానికి కారణమైంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో విదేశీ ఆటగాడిగా మిల్స్ గుర్తింపు పొందాడు. అంతకుముందు బెన్ స్టోక్స్ అత్యధిక ఐపీఎల్ ధరతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంచితే, భారత్ పేసర్ ఇషాంత్ శర్మపై ఏ ఫ్రాంచైజీ కూడా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇషాంత్ కనీస ధర రూ. 2 కోట్లు కావడంతో అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు వెనుకడుగువేస్తున్నాయి. మరొకవైపు భారత ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ పై కూడా ఫ్రాంచైజీలు దృష్టి సారించడం లేదు. ఇర్ఫాన్ పఠాన్ కనీస ధర రూ.50 లక్షలు కాగా, అతన్ని తీసుకోవడానికి ఎవరూ మొగ్గు చూపలేదు.