'ఇప్పుడే రిటైర్ కాను, మళ్లీ జట్టులోకి వస్తా'
మెల్ బోర్న్: టెస్టు జట్టులో పునరాగమనమే వచ్చే ఏడాది తన లక్ష్యమని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తెలిపాడు. వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన తాను 2016లో కచ్చితంగా టెస్టుల్లో ఆడతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడప్పుడే క్రికెట్ నుంచి రిటైర్ కావాలనుకోవడం లేదని 36 ఏళ్ల గేల్ బ్యాట్స్ మన్ స్పష్టం చేశాడు. 2014 జూలైలో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. అతడికి అది 103వ టెస్టు మ్యాచ్.
'వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అందుకే నన్ను టెస్టు టీమ్ కు ఎంపిక చేయలేదు. పూర్తిగా కోలుకునివుంటే తప్పకుండా జట్టులో ఉండేవాడిని. క్రికెట్ నుంచి ఇప్పుడే రిటైర్ కాను' అని గేల్ చెప్పాడు. వెన్ను నొప్పి కారణంగానే టెస్టులో తన పునరాగమనం ఆలస్యమైందని తెలిపాడు. ఇప్పటివరకు తాను ఆడిన టెస్టుల్లో 42.18 సగటుతో 7,214 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది.