‘జి’లో ఈజీ కాదు! | German team arrives in Brazil for 2014 World Cup | Sakshi
Sakshi News home page

‘జి’లో ఈజీ కాదు!

Published Mon, Jun 9 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

‘జి’లో ఈజీ కాదు!

‘జి’లో ఈజీ కాదు!

గ్రూప్-జి
 విశ్లేషణ
 
 జర్మనీ, పోర్చుగల్,
 ఘనా, అమెరికా
 
 ప్రతి ప్రపంచకప్‌లో ఓ గ్రూప్ ఉంటుంది. అందులో అందరూ ఉద్ధండపిండాలే ఉంటాయి. దానినే ‘గ్రూప్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు. నాకౌట్‌కు చేరుకునే అర్హత ఈ నాలుగు జట్లకూ ఉంటుంది. అయితే క్లిష్టమైన ‘డ్రా’ కారణంగా రెండు జట్లకు నిరాశ తప్పదు. పరిశీలకులు ఈసారి ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా ‘జి’ గ్రూప్‌ను పరిగణిస్తున్నారు. టైటిల్ ఫేవరెట్ జర్మనీ, పోర్చుగల్, అమెరికా, ఘనా జట్లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ఈ నాలుగు జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ కీలకమే. ఏ జట్టయినా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.
 
 మాజీ చాంపియన్ జర్మనీ ‘గ్రూప్ టాప్’గా నిలిచే అవకాశం ఉంది.  2006, 2010 ప్రపంచకప్‌లతో పాటు 2008, 2012 యూరో కప్‌లలో కనీసం సెమీఫైనల్‌కు చేరిందంటే ఈ జట్టు సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచకప్ గెలిచి 14 ఏళ్లు కావడంతో మరోసారి అద్భుతమైన ఆటతీరును కనబరిచి నాలుగోసారి టైటిల్ అందుకోవాలని పట్టుదలగా ఉంది.
 
 ప్రపంచకప్ ప్రదర్శన: ఈ మెగా టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన బ్రెజిల్ (5 సార్లు), ఇటలీ (4 సార్లు) తర్వాతి స్థానం జర్మనీదే. ఇప్పటిదాకా మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన జర్మనీ (1954, 1974, 1990) నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. నాలుగుసార్లు మూడో స్థానంలో, ఒకసారి నాలుగో స్థానంలో నిలిచింది. మూడుసార్లు మినహాయిస్తే ఆ జట్టు అంచనాలకు తగ్గట్లుగానే తన ఆటతీరును ప్రదర్శించింది. మొత్తానికి 17 సార్లు ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్ చివరిసారిగా 1990లో విజేతగా నిలిచింది. 18వ సారి ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది.
 
 అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్‌లో జర్మనీ అద్భుతంగా ఆడింది. యూరోప్ రీజియన్‌లోని గ్రూప్ ‘సి’లో జర్మనీ 10 మ్యాచ్‌ల్లో 28 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జర్మనీ కేవలం ఒకే మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ గ్రూప్‌లో ఓటమెరుగని జట్టు జర్మనీయే.
 
 కీలక ఆటగాళ్లు: గోల్‌కీపర్లలో నంబర్‌వన్‌గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మాన్యువల్ న్యూయర్ ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఫుల్‌బ్యాక్ ఫిలిప్ లామ్, బాస్టియన్ ష్వీన్‌స్టీగర్ చాలా కాలం కిందటే అంతర్జాతీయ సాకర్‌లో ఖ్యాతిని ఆర్జించారు. మీసట్ ఒజిల్, థామస్ ముల్లర్, పొడోల్‌స్కీ జట్టుకు ఆయువుపట్టు లాంటి వాళ్లు. ఇక యువ ఆటగాళ్లు మార్కో రియస్, ఆండ్రీ షురెల్, టోనీ క్రూస్, మారియో గోట్జే తమ సత్తా చాటుతున్నారు.
 కోచ్: జోకిమ్ లో; అంచనా: ఫైనల్ చేరుకునే అవకాశం.
 
 ఘనా
 ఫిఫా ర్యాంకుల్లో ఘనాది 37వ స్థానం... ఈ ర్యాంకును చూసిన వారెవరైనా ఈ గ్రూప్‌లో ఉన్న ఘనాను సాధారణంగా తక్కువగా ఉంచనా వేస్తారు. అయితే గత రెండు ప్రపంచకప్‌లో ఘనా ఆకట్టుకునే స్థాయిలో ఆడింది. కానీ ఇటీవలి కాలంలో ఈ జట్టు ఆటతీరు నామమాత్రంగా ఉంది.  
 ప్రపంచకప్ ప్రదర్శన: 2006 ప్రపంచకప్‌లో ఘనా తొలిసారిగా బరిలోకి దిగి రెండో రౌండ్‌కు చేరింది. 2010లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
 
 అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘డి’లో ఘనా ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ప్లే ఆఫ్‌కు చేరింది. ఈజిప్టుతో జరిగిన ప్లే ఆఫ్ తొలి మ్యాచ్‌లో ఘనా 6-1తో గెలవగా.. రెండో మ్యాచ్‌లో 1-2తో ఓడింది. గోల్స్ ఆధారంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
 
 కీలక ఆటగాళ్లు: మైకేల్ ఎస్సైన్, ముంతారి, ఆండ్రీ అయెవ్, క్వాడ్వో అసమో, కెవిన్ ప్రిన్స్ బోటింగ్, అసమో గ్యాన్‌లు ప్రత్యర్థి అవకాశాలను దెబ్బ తీయడంలో ఎక్స్‌పర్ట్స్.
 
 కోచ్: క్వెసి అప్యా
 అంచనా: పోర్చుగల్, అమెరికాలపై నెగ్గితే నాకౌట్‌కు చేరుతుంది.
 
 అమెరికా
 అమెరికా ఇటీవలి కాలంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. జర్మనీ మాజీ ప్లేయర్ జుర్గెన్ క్లిన్స్‌మన్ కోచ్‌గా ఉండటం అమెరికాకు కలి సొచ్చే అంశం.
 ప్రపంచకప్ ప్రదర్శన: అమెరికా ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు ప్రపంచకప్‌లో పాల్గొంది. అయితే ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. ఫిఫా తొలి ప్రపంచకప్ (1930)లో అమెరికా సెమీస్‌కు చేరి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.  గత ప్రపంచకప్‌లో అమెరికా ప్రి క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది.
 
 అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్ తుది రౌండ్‌ను ఓటమితో మొదలుపెట్టిన అమెరికా... ఆవెంటనే కోలుకుంది. ఆ తర్వాత ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చాటింది. మొత్తానికి యూఎస్‌ఏ 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒక డ్రాతో 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
 
 కీలక ఆటగాళ్లు: రొనాల్డో(పోర్చుగల్), ఒజిల్ (జర్మనీ) లాంటి ఆటగాళ్లు ఈ జట్టుకు లేకపోయినా... గ్రూప్ స్టేజ్‌లో ప్రత్యర్థికి షాకిచ్చే సత్తా అమెరికాకు ఉంది. లాండన్ డొనొవా, క్లయింట్ డెంప్సే, జోజి ఆల్టిడోర్, ఎడ్డి జాన్సన్, మైకేల్ బ్రాడ్లే జట్టులో కీలక ఆటగాళ్లు.
 
 కోచ్: జుర్గెన్ క్లిన్స్‌మన్
 అంచనా: గ్రూప్ దశలో ఆడే మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు తప్పనిసరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement