ఆటగాళ్లు, బోర్డుకు గ్రెనాడా ప్రధాని మధ్యవర్తిత్వం!
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ బోర్డుకు ఆటగాళ్లకు మద్య చోటుచేసుకున్న విభేదాలను పరిష్కరించేందుకు గ్రెనాడా ప్రధాని కైత్ మిచెల్ సిద్ధమైయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. భారత్ టూర్ లో భాగంగా నాలుగు వన్డేల అనంతరం విండీస్ ఆటగాళ్లు స్వదేశానికి పయనం కావడంతో సమస్య పరిష్కారం కోసం మిచెల్ ను ఆశ్రయించేందుకు బోర్డు సిద్ధమైంది.
విండీస్ తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లను బీసీసీఐ తాజా రద్దు చేయడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆగమేఘాలపై ఆటగాళ్ల సమస్య పరిష్కారం కోసం వెతుకులాట ఆరంభించింది. ఈ క్రమంలోనే మిచెల్ కలిసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆటగాళ్లకు బోర్డుకు మధ్య చోటు చేసుకున్న విభేదాలపై బోర్డు మంగళవారం తనను కలవాడినికి సిద్దమైనట్లు తెలిపారు. అయితే ఈ సమస్యను తాను ఒక్కడినే పరిష్కరించలేనని తెలిపారు. దీనిపై ఆటగాళ్లు కూడా సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సహకరించాలన్నారు. 'అసలు వారి మధ్య ఏమీ జరిగిందో నాకు తెలియదు. ప్రస్తుతం కనిపించేది నిజంగా ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుందని అనుకోవడం లేదు. అందుకు సంబంధించిన వాస్తవాలు కూడా నాకు పూర్తిగా తెలియవు' అని మిచెల్ తెలిపారు.