కేప్‌టౌన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 209 పరుగులకు ఆలౌటైంది. 28/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విరాట్ సేన.. మరో 181 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(93;95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్పర్) బాధ్యతాయుతంగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. తొలుత 46 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్..ఆపై కూడా అదే తరహాలో ఆడాడు. అయితే సెంచరీకి ఏడు పరుగుల దూరంలో పాండ్యా తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో పాండ్యా సెంచరీ చేస్తాడనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
మరొకవైపు చివరి వరుస ఆటగాడు భువనేశ్వర్ కుమార్(25;86 బంతుల్లో 4 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ క‍్రమంలోనే పాండ్యాతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తరువాత భువీ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భువీ, పాండ్యాలు ఎనిమిది పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో టీమిండియా రెండొందల పరుగుల మార్కును అతికష్టం మీద చేరుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్, రబడాలు చెరో మూడు వికెట్లు సాధించగా, డేల్ స్టెయిన్, మోర‍్నీ మోర్కెల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దాంతో టీమిండియా ఇంకా 77 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment