సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌ను హైదరాబాద్ పేలవంగా ప్రారంభించింది. ఆంధ్ర జట్టుతో ఇక్కడ ఆదివారం ప్రారంభమైన గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (50 బంతుల్లో 17; 3 ఫోర్లు), రవితేజ (30 బంతుల్లో 11; 1 ఫోర్) విఫలమయ్యారు. వెలుతురు తగ్గడంతో ఆట నిలిపివేసే సమయానికి సుమన్ (26 బంతుల్లో 12 బ్యాటింగ్; 2 ఫోర్లు), విహారి (14 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో షాబుద్దీన్, శివకుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
కట్టడి చేసిన ఆంధ్ర...
టాస్ గెలిచిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో రవితేజ ఆరంభం నుంచే తడబడ్డాడు. చక్కటి బంతులతో అతడిని కట్టడి చేసిన షాబుద్దీన్ చివరకు తన ఐదో ఓవర్లో రవితేజను ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. గత రెండు సీజన్లుగా అద్భుతమైన ఫామ్‌తో అదరగొట్టిన అక్షత్, సీజన్ తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. తక్కువ ఎత్తులో వచ్చిన శివకుమార్ బంతిని కట్ చేయబోయి అక్షత్ వికెట్లపైకి ఆడుకోవడంతో 32 పరుగుల వద్ద జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా సుమన్, విహారి జాగ్రత్తగా ఆడారు.
అనుకూలించని మైదానం...
శనివారమే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ కోసం క్యురేటర్లు వికెట్‌ను పూర్తిగా సిద్ధం చేశారు. దాంతో ఆదివారం నిర్ణీత సమయానికే మ్యాచ్ ప్రారంభం కావడం ఖాయంగా అనిపించింది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం చాలా సేపటి వరకు తడిగానే ఉంది. దాంతో అంపైర్లు నితిన్ మీనన్, పశ్చిమ్ పాఠక్ ఉదయం 9.30 గంటలనుంచి మ. 3.00 గంటల వరకు మైదానాన్ని నాలుగు సార్లు పరిశీలించారు. చివరకు కనీసం 23 ఓవర్లు ఆడించే లక్ష్యంతో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభించినా... 82 నిమిషాలు మాత్రమే సాగింది. 16 ఓవర్ల తర్వాత తమకు బంతి కనిపించడం లేదని బ్యాట్స్‌మెన్ చెప్పడంతో ఆఖరి 4 ఓవర్లు స్పిన్నర్లతో వేయించారు.
‘సీవీ’ అరంగేట్రం...
ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు తమ ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ తరఫున చామ వ్రజేంద్ర (సీవీ) మిలింద్, ఆంధ్ర తరఫున చీపురుపల్లి వీర రాఘవులు (సీవీ) స్టీఫెన్ అరంగేట్రం చేశారు. వీరిలో మిలింద్ ఇప్పటికే 3 దేశవాళీ వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడగా... స్టీఫెన్‌కు ఆంధ్ర తరఫున సీనియర్ స్థాయిలో ఇదే తొలి మ్యాచ్. హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 250వ ఆటగాడు మిలింద్ కావడం విశేషం.
రంజీలో తొలి రోజే తడబాటు
Published Mon, Oct 28 2013 12:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement