కుప్పకూలిన ఆంధ్ర
* తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులకే ఆలౌట్
* రంజీ ట్రోఫీ
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో విఫలమైన ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో తడబడింది. 62/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం రెండో రోజు కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రైల్వేస్‌కు 68 పరుగుల ఆధిక్యం దక్కింది. ప్రశాంత్ (49) అర్ధసెంచరీ చేజార్చుకోగా... లోయర్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. కరణ్‌శర్మ 5 వికెట్లు తీశాడు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రైల్వేస్ ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆశిష్ యాదవ్ (55 బ్యాటింగ్) రాణించాడు. సుధాకర్ 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం రైల్వేస్ 262 పరుగుల ఆధిక్యంలో ఉంది.
విహారి డబుల్ సెంచరీ: హనుమ విహారి (447 బంతుల్లో 219; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో గ్రూప్-సి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.
మంగళవారం రెండో రోజు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 173 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిపుర ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.