ఒలింపిక్స్ అంతటి భారీ సమరం... అతిపెద్ద ఖండ శక్తిని చాటే సందర్భం... ఫార్ ఈస్ట్రన్ చాంపియన్‌షిప్ గేమ్స్‌గా ఆరంభమై... భారతీయుడి ఆలోచనతో పేరు మార్చుకుని... కొత్త రూపంతో భారత్‌లోనే బీజం వేసుకుని... అప్రతిహతంగా పద్దెనిమిదోసారి అలరించేందుకు... మరో 10 రోజుల్లో వచ్చేస్తోంది ఏషియాడ్! 16 రోజుల పాటు 45 దేశాల ఆటగాళ్ల పాటవం! ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు పోరాటం!
సాక్షి క్రీడా విభాగం: క్రికెట్ ప్రపంచ కప్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఫుట్‌బాల్ వరల్డ్ కప్ వంటి నాలుగేళ్లకోసారి జరిగే మహా క్రీడా సంబరాలకు దీటుగా జరిగేవి ఆసియా క్రీడలు. సంక్షిప్తంగా ఏషియాడ్. ఓ ఖండానికే పరిమితమైనా, దేశాల (45) ప్రాతినిధ్యం దృష్ట్యా ఒలింపిక్స్ స్థాయి ఉన్న ఈవెంట్ ఇది. కామన్వెల్త్ క్రీడల్లో ఇంతకంటే ఎక్కువ (71) దేశాలు పాల్గొంటున్నా... క్రీడాంశాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఆసియా క్రీడలదే పైచేయి. ఈసారి పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
పూర్వనామం ఫార్ ఈస్ట్రన్...
ఆసియా దేశాలకు ఓ క్రీడోత్సవం ఉండాలన్న ఆలోచన... జపాన్, ఫిలిప్పీన్స్, చైనా చొరవతో 1912లో మొగ్గ తొడిగింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా తదుపరి ఏడాదే ఇది కార్యరూపం దాల్చింది. నాడు ‘ఫార్ ఈస్ట్రన్ గేమ్స్ చాంపియన్‌షిప్’ పేరిట ఈ క్రీడలను నిర్వహించారు. ఆరు దేశాలు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి. రెండేళ్లకోసారి చొప్పున 1934 వరకు ఈ చాంపియన్‌షిప్ సాగింది. 1938లో జపాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా... మాంచు రాజ్యం ఒక దేశంగా ప్రాతినిధ్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ క్రీడలను చైనా బహిష్కరించింది. అప్పటితో ఫార్ ఈస్ట్రన్ చాంపియన్ షిప్ కథ ముగిసింది. పదిసార్లు జరిగిన ఈ క్రీడల్లో భారత్ 1930లో మాత్రమే పాల్గొంది.
భారతీయుడి నామకరణమే
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భారత్ సహా చాలా ఆసియా దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. దీంతో ఏషియాడ్ దిశగా అడుగులు పడ్డాయి. 1948 వేసవి ఒలింపిక్స్ సందర్భంగా లండన్‌లో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల క్రీడా ప్రతినిధులు ‘ఫార్ ఈస్ట్రన్’ పునరుద్ధరణను తెరపైకి తెచ్చారు. అయితే, ఇది సరికొత్త రూపు దాల్చిన ఆసియా దేశాల అస్తిత్వాన్ని ప్రతిబింబించదంటూ... ఒలింపిక్ కమిటీలో భారత ప్రతినిధి అయిన గురుదత్ సోంధి ‘ఏషియాడ్’ రూపంలో ప్రత్యామ్నాయం సూచించారు. ఇదే ప్రాతిపదికపై 1949లో ఢిల్లీలో ‘ఆసియా అథ్లెటిక్ సమాఖ్య’, ‘ఆసియా క్రీడల సమాఖ్య’లను ఏర్పాటు చేశారు. తొలి ఆసియా క్రీడలను 1951లో ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
జపాన్... చైనా జోరు...
1951తో పాటు 1982లో ఏషియాడ్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ రెండుసార్లూ ఢిల్లీనే వేదికైంది. అత్యధికంగా థాయ్‌లాండ్ నాలుగు సార్లు పోటీలను నిర్వహించింది. విశేషమేమంటే... పతకాల పట్టికలో ఇప్పటివరకు జపాన్, చైనా మినహా మరే దేశం అగ్రస్థానంలో నిలవకపోవడం. 1978 వరకు జపాన్... ఆ తర్వాత నుంచి చైనా జైత్రయాత్ర కొనసాగుతోంది.
45 దేశాలు... 465 ఈవెంట్లు
ఈసారి ఆసియాడ్‌లో 45 దేశాలు పాల్గొననున్నాయి. 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment