భారత్‌లో ఆడాలని ఉంది: మోర్తజా
ఢాకా: బంగ్లాదేశ్ జట్టు 2000లోనే టెస్టు హోదా పొందినా ఇప్పటివరకు భారత్‌లో ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. పైగా ఆ జట్టు తొలిటెస్టు ఆడింది భారత్‌తోనే. ప్రస్తుతం బంగ్లా ఆటగాళ్లు భారత్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ జట్టు భారత్‌లో ఆడాలని కోరుకుంటోందని స్వయంగా కెప్టెన్ ముషఫ్రే మోర్తజా చెప్పాడు. ‘‘మా ఆటగాళ్లు భారత్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో భారత్‌లో మేం ఆడతాం’’ అని మోర్తజా ఆశాభావం వ్యక్తం చేశాడు.
బంగ్లాదేశ్ భారత్‌లో వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కాదు. ఆసియా కప్, ముక్కోణపు సిరీస్‌ల సందర్భంగా. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లో తమతో మ్యాచ్ సందర్భంగా వివాదం సృష్టించిన రోహిత్ అవుట్ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. భారత జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌నో టార్గెట్ చేయలేమని అందరూ ప్రతిభావంతులేనని అన్నాడు. డీఆర్‌ఎస్ నిబంధనకు భారత్ ఒప్పుకోకపోవడంపై మాట్లాడుతూ దాని గురించి పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించాడు. వచ్చే నెలలో బంగ్లాలో భారత్ వన్డే సిరీస్ సందర్భంగా వర్షం అంతరాయం కల్గించకూడదని కోరుకుంటున్నట్లు తెలిపాడు.