ఆటంతా వీళ్లదే
ఫుట్‌బాల్ ఆటంటే సమష్టితత్వానికి పర్యాయపదం. అందరూ కలిసి ఆడితేనే జట్టుకు విజయఫలం దక్కుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ‘మనం’ అనే చోట ‘ఒక్కడు’ కూడా వెలిగిపోతాడు. అద్వితీయ విన్యాసాలతో క్షణాల్లో మ్యాచ్ రూపురేఖలను మార్చేస్తాడు. రాత్రికి రాత్రే జాతీయ హీరోగా అవతరిస్తాడు. ప్రపంచకప్ బరిలో 32 జట్లు ఉన్నా... ఎక్కువ మంది దృష్టి కొందరు ఆటగాళ్లపైనే ఉంది. వారి మెరుపు కదలికలు... సమన్వయం... ముందుచూపు... మ్యాచ్ ఫలితాలను శాసిస్తాయి. ఈ ప్రపంచకప్‌లో వ్యక్తిగత ప్రదర్శనతో జట్ల ఫలితాలను ప్రభావితం చేయబోతున్న ‘స్టార్స్’ వివరాలు క్లుప్తంగా....
- సాక్షి క్రీడావిభాగం
నెమార్
దేశం: బ్రెజిల్; పుట్టిన తేదీ: 5 ఫిబ్రవరి, 1992
ఎత్తు: 175 సెం.మీ.
అరంగేట్రం: 10 ఆగస్టు, 2010
ఆడే స్థానం: ఫార్వర్డ్
ఆడిన మ్యాచ్‌లు: 48
అంతర్జాతీయ గోల్స్: 31
ప్రస్తుత క్లబ్: బార్సిలోనా (స్పెయిన్)
సాంబా... సెక్స్... సాకర్
ఫుట్‌బాల్ అభిమానులు కళ్లు కాయలు కాచే లా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. ప్రపంచకప్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. నాలుగేళ్లకోసారి జరిగే సాకర్ సంగ్రామం అభిమానులను ఊపేయబోతోంది. ఇక బ్రెజిల్‌లో అయితే పూర్తిగా పండగ వాతావరణం కనిపిస్తోంది. బ్రెజిల్ అంటే సాకర్... బ్రెజిల్ అంటే సాంబ డ్యాన్స్... బ్రెజిల్ అంటే సెక్స్... ఈ మూడు ఈసారి దేశాన్ని ఊపేయబోతున్నాయి. బ్రెజిల్ ఆతిథ్యం ఎలా ఉంటుందో ప్రపంచం రుచి చూడబోతోంది.
సెన్సార్ లేదు
ప్రపంచంలో సెన్సార్ లేని దేశం బ్రెజిల్. అందుకే విచ్చలవిడి శృంగారానికి ఆ దేశం కేరాఫ్ అడ్రస్. ఫుట్‌బాల్ చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా బయల్దేరిన అభిమానులు ఈ ట్రిప్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రపంచకప్ జరిగే సమయంలో సుమారు ఆరు కోట్ల కండోమ్స్ అవసరమవుతాయని అంచనా. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యూఎన్ ఎయిడ్స్ అయితే ‘ప్రొటెక్ట్ ద గోల్’ ప్రచార కార్యక్రమాన్ని ఎప్పుడో మొదలుపెట్టింది. అంతే కాదు తమ తరఫున హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ని అదుపులో ఉంచే 20 లక్షల కండోమ్‌లను అభిమానుల కోసం అందుబాటులో ఉంచింది. అయితే బ్రెజిల్‌కు చేరుకున్న కొందరు అభిమానులు మాత్రం ఇవి ఏ మాత్రం సరిపోవంటున్నారు. ఒక రోజుకు సరిపడా కండోమ్‌లను అందుబాటులో ఉంచితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక కండోమ్‌ల బిజినెస్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమయ్యాయి. అభిమానులను ఆకట్టుకునేందుకు సాకర్ ఆటగాళ్ల పేర్లతో కండోమ్‌లను ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. బ్రెజిల్ సాకర్ స్టార్ నెమార్ పేరుతో విడుదలైన కండోమ్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇక భద్రతకు, ఆరోగ్యానికి పెద్దపీట వేసే అమెరికన్లు కండోమ్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ శాఖ(సీడీసీ) సూచనల మేరకు సాకర్ అభిమానులు తమ దేశంలో తయారైన కండోమ్‌లను బ్రెజిల్‌కు తీసుకొస్తున్నారట.
బ్రెజిల్ షట్‌డౌన్...!
సాకర్.. సాకర్.. సాకర్.. ఇప్పుడు బ్రెజిల్‌లో సాకర్ మినహా మరో మాట లేదు.. ఎవరి నోట విన్నా ఇదే మాట.. ఎవరిని పలకరించినా ఇదే మాట.. చాలా ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తుండటంతో సాకర్‌లో మునిగితేలిపోవాలని బ్రెజిల్ వాసులు నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ఐదు వారాల పాటు సాకర్ మినహా మరేదానికి చోటు లేకుండా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. ఈ కారణంగా బ్రెజిల్‌లో వ్యాపార కార్యకలాపాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఒకరకంగా షట్‌డౌన్ లాంటిదేనని అభిప్రాయపడుతున్నారు.
పాల్ తర్వాత..?
ఆక్టోపస్ పాల్.. ఈ పేరు చెప్పగానే అభిమానులకు ఠక్కున గుర్తుకొచ్చేది 2010 సాకర్ ప్రపంచకప్.. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ఈ చిన్ని జీవి అంచనాలు అక్షరాలా నిజమయ్యాయి. జర్మనీకి చెందిన ఈ ఆక్టోపస్ తమ జట్టు సెమీస్‌లో ఓడిపోతుందని చెప్పింది. అచ్చం అలాగే జరిగింది. ఫైనల్లో స్పెయిన్ విజేతగా నిలుస్తుందని అంచనా వేసింది. అది కూడా నిజమైంది. మొత్తానికి ఆ ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. అయితే నాలుగేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ప్రపంచకప్ మొదలవుతోంది. దీంతో అందరూ ఆక్టోపస్ పాల్‌నే గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ఈ సారి విజేత ఎవరో అంచనా వేయడానికి పాల్ జీవించి లేదు. 2010 ప్రపంచకప్ ముగిసిన కొద్ది రోజులకే అది చనిపోయింది. ఇప్పుడు ఆక్టోపస్ పాల్ లేకపోయినా.. ఆ లోటును భర్తీ చేసేందుకు మరికొన్ని సముద్రపు జీవులు, జంతువులు, పక్షులు సిద్ధంగా ఉన్నాయి.
జర్మనీలోని హోడెన్‌హాగెన్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఉన్న నెల్లి అనే ఏనుగు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాకర్ మ్యాచ్‌ల విజేతలను అంచనా వేయడంలో నెల్లి ఎక్స్‌పర్ట్. రెండు గోల్‌పోస్ట్‌లను పక్కపక్కన ఉంచితే ఈ ఏనుగు సాకర్ బంతిని గట్టిగా తంతుంది. ఫుట్‌బాల్ ఏ పోస్ట్‌లోకి వెళితే ఆ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. 2006 ఫిఫా మహిళల ప్రపంచకప్ సందర్భంగా నెల్లి అంచనా వేసిన 30 మ్యాచ్‌ల ఫలితాలు నిజమయ్యాయి. అలాగే వివిధ దేశాల్లో బ్రెట్ (జీబ్రా), తియాన్ తియాన్ (పాండా), బ్యారీ (జెల్లీ ఫిష్), ఎల్మర్ (పక్షి), చియో (జింక) సాకర్ విజేతల్ని అంచనా వేస్తామంటున్నాయి. మరి వీటిలో పాల్ వారసులెవరో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.
లియోనెల్ మెస్సి
దేశం: అర్జెంటీనా; పుట్టిన తేదీ: 24 జూన్, 1987
ఎత్తు: 169 సెం.మీ.
అరంగేట్రం: 17 ఆగస్టు, 2005
ఆడే స్థానం: ఫార్వర్డ్; ఆడిన మ్యాచ్‌లు: 84
అంతర్జాతీయ గోల్స్: 37
ప్రస్తుత క్లబ్: బార్సిలోనా (స్పెయిన్)
క్రిస్టియానో రొనాల్డో
దేశం: పోర్చుగల్
పుట్టిన తేదీ: 5 ఫిబ్రవరి, 1985
ఎత్తు: 185 సెం.మీ.
అరంగేట్రం: 20 ఆగస్టు, 2003
ఆడే స్థానం: ఫార్వర్డ్
ఆడిన మ్యాచ్‌లు: 110
అంతర్జాతీయ గోల్స్: 49
ప్రస్తుత క్లబ్: రియల్ మాడ్రిడ్ (స్పెయిన్)
డేవిడ్ విల్లా
దేశం: స్పెయిన్
పుట్టిన తేదీ: 3 డిసెంబరు, 1981
ఎత్తు: 175 సెం.మీ.; అరంగేట్రం: 9 ఫిబ్రవరి, 2005
ఆడే స్థానం: ఫార్వర్డ్; ఆడిన మ్యాచ్‌లు: 95
అంతర్జాతీయ గోల్స్: 56
ప్రస్తుత క్లబ్: అట్లెటికో మాడ్రిడ్ (స్పెయిన్)
వేన్ రూనీ
దేశం: ఇంగ్లండ్
పుట్టిన తేదీ: 24 అక్టోబరు, 1985; ఎత్తు: 176 సెం.మీ.
అరంగేట్రం: 12 ఫిబ్రవరి, 2003
ఆడే స్థానం: ఫార్వర్డ్; ఆడిన మ్యాచ్‌లు: 90
అంతర్జాతీయ గోల్స్: 38
ప్రస్తుత క్లబ్: మాంచెస్టర్ యునెటైడ్ (ఇంగ్లండ్)
రాబిన్ వాన్ పెర్సీ
దేశం: నెదర్లాండ్స్
పుట్టిన తేదీ: 6 ఆగస్టు, 1983
ఎత్తు: 186 సెం.మీ.;
అరంగేట్రం: 4 జూన్, 2005
ఆడే స్థానం: ఫార్వర్డ్; ఆడిన మ్యాచ్‌లు: 84
అంతర్జాతీయ గోల్స్: 43
ప్రస్తుత క్లబ్: మాంచెస్టర్ యునెటైడ్ (ఇంగ్లండ్)
లుకాస్ పొడోల్‌స్కీ
దేశం: జర్మనీ
పుట్టిన తేదీ: 4 జూన్, 1985
ఎత్తు: 180 సెం.మీ.
అరంగేట్రం: 6 జూన్, 2004
ఆడే స్థానం: ఫార్వర్డ్
ఆడిన మ్యాచ్‌లు: 113
అంతర్జాతీయ గోల్స్: 46
ప్రస్తుత క్లబ్: అర్సెనల్ (ఇంగ్లండ్)
ఫేవరెట్ బ్రెజిల్
ఈసారి ప్రపంచకప్‌లో ప్రధానంగా నాలుగు జట్లపై అందరి కళ్లూ ఉన్నాయి. బ్రెజిల్, అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్... ఈ నాలుగు జట్లలో ఒకటి టైటిల్ గెలిచే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. సొంతగడ్డపై గత పుష్కరకాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని బ్రెజిల్‌కు... మిగిలిన మూడు జట్ల కంటే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏమో... ‘గుర్రం ఎగరావచ్చు’ అనే సామెత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అతికినట్టు సరిపోతుంది. ఎవరూ ఊహించని జపాన్, తొలిసారి ఆడుతున్న బోస్నియా... ఇలా ప్రతి జట్టూ సంచలనాల కోసమే తహతహలాడుతున్నాయి. ఎవరు గెలిచినా వినోదం మాత్రం ఫుల్.
బలోటెలి
దేశం: ఇటలీ
పుట్టిన తేదీ: 12 ఆగస్టు, 1990
ఎత్తు: 189 సెం.మీ.; అరంగేట్రం: 10 ఆగస్టు, 2010
ఆడే స్థానం: ఫార్వర్డ్; ఆడిన మ్యాచ్‌లు: 29
అంతర్జాతీయ గోల్స్: 12
ప్రస్తుత క్లబ్: ఏసీ మిలాన్ (ఇటలీ)