'స్టీవ్ స్మిత్ చేసింది తప్పే'
బెంగళూరు:ఇటీవల భారత్ తో బెంగళూరులో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ పై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యవహరించిన తీరును దేశ మాజీ కెప్టెన్ స్టీవ్ వా తప్పుబట్టాడు. ఒక మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ కు సంకేతాలు ఇవ్వడం కచ్చితంగా తప్పేనన్నాడు. తనకు ఆ సమయంలో బుర్ర పనిచేయలేదంటూ స్మిత్ సమర్ధించుకోవడన్ని కూడా వా ఎత్తి చూపాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ఏ పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సి వచ్చినా అది తప్పేనని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.
' స్టీవ్ స్మిత్ చేసింది తప్పే. అలా చేసి ఉండాల్సింది కాదు. మళ్లీ స్మిత్ ఆ తరహా తప్పు చేస్తాడని నేను అనుకోవడం లేదు. డీఆర్ఎస్ పై స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ కు సంకేతాలు ఇవ్వడం నేను లైవ్ లో చూడలేదు. రికార్డు అయిన తరువాత మాత్రమే చూశా. అతను తప్పు చేసినట్లు కనబడింది. దాన్ని స్మిత్ అంగీకరిస్తాడని నేను ముందుగానే అనుకున్నా. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో ప్రతీ దానికి అనవసర రాద్దాంతమైతే జరుగుతుంది. ఇదే 15 ఏళ్ల క్రితం జరిగి ఉంటే ఇంత చర్చ ఉండేది కాదు. ఏదైనా స్మిత్ తప్పు చేశాడు. ఇకపై చేయడని నేను అనుకుంటున్నా'అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో స్టీవ్ వా పేర్కొన్నాడు.