అనుష్కతో అనుబంధంపై కోహ్లి
దాపరికం ఏమీ లేదు!
ముంబై: అనుష్కశర్మ, తాను ఒకరినొకరు ఇష్ట పడుతున్నామని, ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అన్నీ తెలిసి కూడా పదే పదే అదే అడగటం బాగా లేదని అతను అన్నాడు. ‘మా ఇద్దరి మధ్య ఏముందో మీకందరికి కనిపిస్తూనే ఉంది. మేం దీనిని దాచాలని భావించడం లేదు కూడా. ఇకపై ఉత్కంఠ అనవసరం. కానీ కొంతమంది అవునా, ఇది నిజమేనా అని మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకునే లోకజ్ఞానం లేదా! ఇది వ్యక్తిగత విషయం. దీనిపై బహిరంగంగా మాట్లాడటం మాకు ఇష్టం లేదు. కాబట్టి మమ్మల్ని ఏకాంతంగా ఉండనివ్వండి’ అని కుండబద్దలు కొట్టాడు. గురువారం ఇక్కడ కోహ్లి ‘రాంగ్’ పేరుతో సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు.
‘నంబర్‌వన్’గానే భారత్: ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతోంది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో భారత్ 117 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (115) రెండో స్థానంలో నిలవగా...దక్షిణాఫ్రికా (114) మూడో స్థానంలో ఉంది. వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, బౌలర్ల ర్యాంకుల్లో భువనేశ్వర్ కుమార్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.