'కోహ్లీతో కలిసి ఆడటం కలిసొచ్చింది'
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి నాయకుడని టెస్ట్ ఓపెనర్ బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ అన్నాడు. విరాట్ అందరినీ ఒకే విధంగా చూస్తాడని చెప్పాడు. అతని ఆటతీరు తనకు చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందని యువ ఆటగాడు రాహుల్ తెలిపాడు. తాను చేసిన రెండు టెస్ట్ సెంచరీలు విరాట్ నాన్స్ట్రయికర్గా ఉన్నప్పుడు చేసినవే అని గుర్తుచేసుకున్నాడు. అతడితో కలిసి ఆడుతున్నప్పుడు పరుగులు చేయడం చాలా సులువని, తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. ఇటీవలే తాను వేయించుకున్న టాటూ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టాటూ కోసం 15 గంటల పాటు సమయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇది రెండు విషయాలను తనకు గుర్తుచేస్తుందన్నాడు.
ప్రతిరోజు అనేది తనకు కొత్త ప్రారంభమని, నిన్న అనేది ఎప్పటికీ మరిచిపోయేదని అన్నాడు. టాటూలో ఉన్న రెక్కలు ఉన్నత స్థానానికి ఎదగాలని సూచిస్తాయని రాహుల్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో 3,1 పరుగులకే ఔటయిన ఇన్నింగ్స్ మరిచిపోయేవని, ఆ తర్వాత సిడ్నీలో చేసిన సెంచరీ(110 పరుగులు) ఇన్నింగ్స్ గుర్తుంచుకోదగినది చెప్పుకొచ్చాడు. గత పది నెలల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడటం భారత్పై ఏమాత్రం ఒత్తిడి పెంచదని రాహుల్ అభిప్రాయపడ్డాడు.