సాక్షి, న్యూఢిల్లీ: అక్షర్‌ధామ్ మందిరం సమీపాన ఉన్న మురికివాడలోని గుడిసెలను (జుగ్గీలు) తొలగించడానికి వచ్చిన మున్సిపాలిటీ అధికారుల బృందాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా నేతృత్వంలో కొందరు ఆప్ కార్యకర్తలు శుక్రవారం అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు యమునాతీరాన ఆక్రమణలను తొలగించడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకోవడానికి మనీష్ సిసోడియా కార్యకర్తలతో కలసి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సిసోడియా స్పందిస్తూ మానవతా దృక్పథంతో ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నట్లు చెప్పారు. చలికాలంలో జుగ్గీలను తొలగిస్తే ఇక్కడి పేదలంతా చలిలో రాత్రులు గడపవలసి వస్తుందని ఆయన చెప్పారు. జుగ్గీల తొలగింపునకు ఐదు నెలల క్రితమే హైకోర్టు ఆదేశించిందని, ఇప్పుడు వాటిని తొలగించడం వెనుక రాజకీ యం ఉందని సిసోడియా ఆరోపించారు.
యమునానది తీరంలో చాలా సంవత్సరాల కిందట వెలసిన జుగ్గీలను తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. వాటిని తొలగించడానికి అధికారుల బృందం పోలీసులతోపాటు శుక్రవారం ఉదయం అక్షర్‌ధామ్ వద్దకు చేరుకుంది. ఈ సంగతి తెలుసుకున్న పత్పట్‌గంజ్ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా ఆప్ కార్యకర్తలతోపాటు అక్కడికి చేరుకున్నారు. ఆక్రమణల తొలగింపును ఆరంభించగానే కార్యకర్తలు, జుగ్గీవాసులతోపాటు నినాదాలు చేస్తూ నేలపై పడుకున్నారు. దీంతో ఆక్రమణల తొలగింపు కోసం వ చ్చిన బృందం వెనుదిరిగింది. జుగ్గీల తొలగింపు వెనుక దుష్టరాజకీయం ఉందని సిసోడియా ఆరోపించారు. తమకు ఓటు వేయకుండా ఆప్‌కు ఓటు వేసినందుకే జుగ్గీలను తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు స్థానికులతో చెప్పారని ఆయన ఆరోపించారు.
గుడిసెల తొలగింపును అడ్డుకున్న ఆప్
Published Sat, Dec 21 2013 12:29 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement