న్యూఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఢిల్లీశాఖ కార్యాలయంలో శుక్రవారం సంబరాలు అంబరాన్ని తాకాయి. భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న కార్యకర్తలు కాషాయ టోపీలు, టీ-షర్టులు ధరించి బాణ సంచా కాల్చారు. పండిట్‌మార్గ్‌లో ఉన్న ఈ కార్యాలయంలో సంగీత వాయిద్యాలు మోగిస్తూ నృత్యాలు చేశారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో వీళ్ల ఉత్సాహం రెట్టించింది. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ గెలుపును ఆస్వాదించారు. పార్టీ విజయం ఘనత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ‘మోడీ దార్శనికత, పార్టీ ప్రచారం వ్యూహం విజయం చేకూర్చాయి.
మోడీ ఆకర్షణ కార్యకర్తలు, నాయకులను ముందుకు నడిపించింది. ఫలితాలు మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని అన్ని స్థానాల్లో గెలుస్తన్నట్టు సమాచారం రాగానే కార్యకర్తలంతా అమిత ఉత్సాహంతో నృత్యాలు చేశారు. ఆప్‌కు ఒక్క సీటూ రాకున్నా ఓట్లపరంగా రెండోస్థానంలో నిల్చింది. కాంగ్రెస్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం ఏడు స్థానాలనూ కైవసం చేసుకోవడం తెలిసిందే. ఇక అశోకారోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోనూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో అక్కడి రోడ్డుపై ట్రాఫిక్ కాసేపు స్తంభించింది.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం: వర్ధన్
పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ఢిల్లీ బీజేపీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధంగా ఉందని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయబోమని స్పష్టం చేశారు. శాసనసభను ఎక్కువకాలం సుప్తచేతనావస్థలో ఉంచడం మంచిది కాదన్నారు.
బీజేపీ కార్యాలయంలో సంబరాలు
Published Fri, May 16 2014 10:27 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement