నిరుద్యోగ భృతి
- మేనిఫెస్టోను విడుదల చేసిన దేవెగౌడ
- కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
- వాటికి ఎంతసేపూ రాజకీయంగా బలపడాలన్న యావే
- కావేరి, కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి అన్యాయం
- జాతీయ రాజకీయాల్లో భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగర యువతకు నిరుద్యోగ భృతి, అవినీతి సొమ్ము స్వాధీనానికి ప్రయత్నాలు, నదీ జలాల పంపకానికి ఏక రూప జాతీయ విధానం, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహం లాంటి హామీలతో జేడీఎస్ శుక్రవారం లోక్‌సభ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడ 20 పేజీలతో కూడిన ‘మా సంకల్పం’ పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నదీ జలాల పంపకంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ఆరోపించారు. రాజకీయంగా బలపడాలనే యావ తప్ప వాటికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని నిష్టూరమాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి అంతర్ రాష్ట్ర జలాల పంపకానికి సంబంధించి జాతీయ విధానాన్ని ప్రకటించాల్సిందిగా జేడీఎస్ కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని తెలిపారు.
అవసరమైతే దీనిపై పోరాటానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. ప్రతి నదికీ ఓ విధానం రాష్ట్రం పాలిట శాపంలా తయారైందని, కావేరి, కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా దక్కలేదని ఆరోపించారు. గ్రామీణాభివృద్ధిని పట్టణాభివృద్ధితో అనుసంధానం చేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంధి కాలంలో మున్ముందు జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర పరిమితమవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని అన్నారు.