మేనిఫెస్టోలు కురవని మేఘాలు | Skyene omfatter Manifesto | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టోలు కురవని మేఘాలు

Published Wed, Apr 9 2014 1:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మేనిఫెస్టోలు కురవని మేఘాలు - Sakshi

మేనిఫెస్టోలు కురవని మేఘాలు

మేనిఫెస్టోలలో ఏమైనా చెప్పుకోవచ్చు. గతంలో వ లెనే ఇప్పుడూ నిరుపేద రైతులను వాక్చాతుర్యంతో, వాగ్దానాలతో మభ్య పెట్టవచ్చునని పార్టీలు భావిస్తూ ఉండవచ్చు. అయితే ఈ మేనిఫెస్టోలలోని నిబద్ధతనీ, నిజాయితీనీ నిగ్గు తేల్చుకోవలసిన వారు రైతన్నలు, వ్యవసాయ రంగ, గ్రామీణ ప్రాంత శ్రేయోభిలాషులే.
 
 ఎన్నికల రుతువులో రాజకీయ పక్షాలు ప్రణాళికలనీ, వాగ్దానాలనీ వర్షిస్తాయి.  కానీ ఎక్కువ భాగం మేనిఫెస్టోలు మభ్యపెట్టేవేనన్నది చరిత్ర చెప్పే వాస్తవం. చాలా మేనిఫెస్టోలు తేలిపోయే మబ్బులే. ఆచరణ సాధ్యం కాని హామీలతో వచ్చిన మేనిఫెస్టోలే దేశంలో ఎక్కువ. కొన్ని పక్షాల మేనిఫెస్టోలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఆచరణయోగ్యమైన హామీలే ఇచ్చి, నెరవేర్చిన చరిత్ర కలిగిన పార్టీలు కొన్నైనా ఉన్నాయి. పదహారో లోక్‌సభకు జరుగుతున్న ఈ ఎన్నికలలో పోటీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకీ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకీ మధ్యనే నెలకొని ఉండడంతో ఎన్నికల ప్రణాళికల విషయంలో అవి పట్టింపుతోనే వ్యవహరించాయి.
 ఏ రాజకీయ పక్షమైనా చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాననే చెబుతుంది. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు నమ్మబలుకుతుంది. రైతు విషయంలో పార్టీలన్నీ కూడా మమతను ప్రక టిస్తాయి. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో ఇదే చెబుతోంది.

వీటిని పరిశీలిద్దాం.
నిబద్ధత కరువైన కాంగ్రెస్ మేనిఫెస్టో
 
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పలు పథకాల ద్వారా వ్యవసాయ రంగ జీడీపీని యూపీఏ-1 (2004-2009) హయాంలో 2.6 నుంచి 3.1కి పెంచినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నది. యూపీఏ-2 (2009-2014) రెండో అంకంలో దానిని 4 శాతానికి పెంచినట్టు కూడా చెప్పుకున్నది. ఈ వివరంతో పాటు, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలను మాత్రం వివరించలేదు. కానీ ఈ గణాంకాలలో పొరపాటు దొర్లి ఉండాలి. లేదా దేశ వ్యాప్త ఆహార డిమాండ్ అంచనాలను లెక్కించడంలో తీవ్ర తప్పిదమైనా జరిగి ఉండాలి. లేకుంటే పెరుగుదలకూ, ద్రవ్యోల్బణానికీ పొంతన కుదిరి ఉండేది. ఇక మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు యూపీఏ తీసుకున్న చారిత్రక నిర్ణయం. ఇది భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులకు ఆస్కారం కల్పించే నిర్ణయమని చెబుతున్నారు.

వసాయోత్పత్తుల విలువ పెంచుకోవడానికి అవకాశం, వర్గీకరణ, ప్యాకింగ్, శీతల గిడ్డంగుల నిర్మాణం, వీటి నిర్వహణ, దీర్ఘకాల నిల్వల కోసం గిడ్డంగులు వంటి గ్రామీణ ప్రాంత నిర్మాణాలకు ఈ నిర్ణయం ఊతం ఇస్తుంది. కానీ ఇది సాధ్యం కావాలంటే, రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పత్తుల కమిటీలు అమలు చే స్తున్న చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టం, కొన్ని ఇతర చట్టాలలో కూడా మార్పులు చేయాలి. కాకపోతే, ప్రస్తుత సంకీర్ణ రాజకీయ యుగంలో విదేశీ సంస్థలు మన వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడం కష్టమే. యూపీఏ మల్టీబ్రాండ్ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ, దీని అమలుకు అవసరమైన ఇతర చట్టాలలో మార్పులు తేవడానికి ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. కాబట్టే మన వ్యవసాయరంగం ఇంతవరకు ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేదు.

 కోటి హెక్టార్ల భూమికి సాగు వసతి కల్పిస్తామన్నది మరో వాగ్దానం. ఇందులోనూ నిబద్ధత లేదు. రైతులే సభ్యులుగా ఉన్న నీటి వినియోగ సంఘాలకే నీటి పారుదల యాజమాన్యం అప్పగించి, పదికోట్ల హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యం కల్పించాలన్నది పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచిన నీటి సంస్కరణల లక్ష్యం. కానీ భూగర్భ జలాల వృద్ధికి చాలినంత కృషి జరగకుండా, నీటి ఒప్పందాలు జరగకుండా ఇలాంటి వాగ్దానాలను ఎలా అమలు చేయగలరు? ముఖ్యంగా జల వనరుల పంపకాలలో రాష్ట్రాల మధ్య రాజకీయమే ప్రధానమైపోయిన ఈ సమయంలో ఇది ఎంత వరకు సాధ్యం?

 పంటల బీమా గురించి కూడా ప్రస్తావన ఉంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు, రుణాలు తీసుకోని రైతులకు కూడా ఈ పథకాన్ని విస్తరింపచేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. పంటల బీమాలో ప్రైవేటు రంగానికి కూడా ప్రవేశం కల్పించాలన్నది ఈ పార్టీ ఆశయం. కానీ యూపీఏ ఈ పదేళ్ల పాలనలో ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? తక్కువ వడ్డీతో సంఘాలకూ, చిన్న, సన్నకారు రైతుల సంఘటిత బృందాలకూ, మహిళలకూ 5 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలిస్తామని ఈ పార్టీ చెబుతున్నది. ఇందులో కొత్తదనమేమీ లేదు. దీనితో పేదరిక నిర్మూలనా సాధ్యం కాదు. ఇటువంటి పథకాలు పేదలకు మేలు చేసిన దాఖలాలు తక్కువే.  

 కమలానిదీ ‘చేతి’వాటమే

 అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పుకుంటున్న బీజేపీ ఆర్థిక విధానాలూ, అమలూ కాంగ్రెస్ నుంచి పెద్దగా వేరు చేసి చూడనవసరం లేదు. అంతా ఊహించినట్టు కాక,  ప్రస్తుతానికి తమ పార్టీ మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించబోదని పార్టీ మేనిఫెస్టో పేర్కొన్నది. ఆది నుంచి వర్తకుల, అగ్రవర్ణాల పార్టీగా పేరున్న బీజేపీ చిన్న వర్తకులూ, కిరాణా కొట్లు యాజమానుల ఒత్తిడితో ఈ అంశంలో వెనక్కి తగ్గింది. కానీ, ఎన్నికలకు ముందు ఈ అంశానికి పార్టీ అనుకూలం కాదని చెప్పవచ్చు. తరువాతైనా కాంగ్రెస్ అనుభవాలను చూపించి, అనుమతించే అవకాశం లేకపోలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అన్ని రంగాల్లోనూ ఆహ్వానిస్తూ, మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో మాత్రం వ్యతిరేకిస్తున్నామని (అదీ ప్రస్తుతానికి) కాబోయే దేశ ఆర్థిక మంత్రిగా ప్రచారం పొందుతున్న అరుణ్ జైట్లీ చెప్పడం విశేషమే. పెట్టుబడులు పెట్టేవారికి స్నేహహస్తం అందిస్తామని ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెబుతున్నారు. కానీ విదేశీ పెట్టుబడులు రావడానికి తన గతమే ప్రతిబంధకమవుతుందేమోనన్న ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు.

 వ్యవసాయం గురించి మేనిఫెస్టోలో పెద్దగా విశదీకరించక పోయినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ‘జాతీయ వ్యవసాయ మార్కెట్’ను  అభివృద్ధి పరుస్తామని బీజేపీ చెప్పింది. వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి మేనిఫెస్టో క్లుప్తంగానే ప్రస్తావించినా, సాగులో ప్రభుత్వ రంగ పెట్టుబడుల గురించి గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు విస్తారంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. పార్టీకి ఉన్న విస్తృత ప్రణాళిక ప్రకారం ఆర్థిక వృద్ధిని సాధించాలనీ, వ్యాపార సెంటిమెంటుకు అనుకూలంగా ప్రభావితం చేయాలనీ అందులో భాగంగా వ్యవసాయం, తయారీ రంగం, సామాజిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని నాయకులు చెబుతున్నారు. లాభసాటి వ్యవసాయం అంటే, గ్రామీణ నిర్మాణాల అభివృద్ధి(గిడ్డంగుల వంటివి), గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, పెండింగ్‌లో ఉన్న జల ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి ఆశయాలు గమనించదగినవి.
 
జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టోల్లో సేద్యం కోసం ప్రత్యేక ప్రతిపాదనలంటూ లేవు. తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు ఆకాశానికి నిచ్చెనలు వేయిస్తామంటున్నాయి. సుమారు లక్ష కోట్ల మేరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామనీ, వారికి ఉచిత విద్యుత్ అందిస్తామనీ, సేద్యాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పడం చూస్తున్నాం. చరిత్రను బట్టి ఇవన్నీ ఆచరణ సాధ్యం కానివే.  లాభసాటి వ్యవసాయానికి స్థిరీకరణ నిధి ఏర్పాటు, నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ వైఎస్సార్ పార్టీ చేస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యమే. అయినా ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోల గురించిన చర్చకు వేరొక సందర్భాన్ని ఎంచుకోవాలి.
 మేనిఫెస్టోలలో ఏమైనా చెప్పుకోవచ్చు. గతంలో వ లెనే ఇప్పుడూ నిరుపేద రైతులను వాక్చాతుర్యంతో, వాగ్దానాలతో మభ్య పెట్టవచ్చునని పార్టీలు భావిస్తూ ఉండవచ్చు. అయితే ఈ మేనిఫెస్టోలలోని నిబద్ధతనీ, నిజాయితీనీ నిగ్గు తేల్చుకోవలసిన వారు రైతన్నలు, వ్యవసాయ,గ్రామీణ ప్రాంత శ్రేయోభిలాషులే. హామీలూ, వాగ్దానాలూ గుప్పిస్తున్న  ఆయా పక్షాల నిజాయితీ, చరిత్ర, పరిణతిలను  బేరీజు వేసుకునే బాధ్యత కూడా వారిదే.    
 (వ్యాసకర్త సీనియర్ సైంటిస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement