అమల్లోకి పెట్రోల్ డిస్కౌంట్
• డిజిటల్ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వ నజరానా
• గరీబ్ కల్యాణ్ పథకంపై ఈ వారంలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేవారికి 0.75 శాతం డిస్కౌంట్ సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలుతో పాటు, బీమా పాలసీలు, రైలు టికెట్లు, జాతీయ రహదారులపై టోలు చార్జీలు డిజిటల్ రూపంలో చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని గత వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. డిజిటల్ చెల్లింపు జరిగిన మూడు రోజుల్లో డిస్కౌంట్ మొత్తం కొనుగోలుదారుడి ఖాతా కు జమవుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. క్రెడిట్/డెబిట్ కార్డులు, ఈ వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పీఎస్‌యూ(ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) పెట్రోల్ బంకుల్లో చేసిన కొనుగోళ్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
లీటరు పెట్రోల్ పై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసలు డిస్కౌంట్ రూపంలో వెనక్కి రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.10, డీజిల్ రూ.54.57గా ఉంది. నోట్ల రద్దు అనంతరం డిపాజిట్ చేసిన నల్లధనంలో 50 శాతం పన్ను, సర్‌చార్జిగా చెల్లించడానికి ఉద్దేశించిన పథకానికి సంబంధించి ఈ వారంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. బ్యాంకుల్లో జమచేసిన ఈ అప్రకటిత నగదుపై ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద 50 శాతం పన్ను, సర్‌చార్జీల్ని వసూలు చేస్తారు. ప్రకటించిన మొత్తం లో 25 శాతం నాలుగేళ్ల అనంతరం ఎలాంటి వడ్డీ చెల్లించకుండా వెనక్కిస్తారు.
ఇందుకోసం పన్ను చట్టాల(రెండో సవరణ) బిల్లును నవంబర్ 29న లోక్‌సభ ఆమోదించింది. నవంబర్ 30న రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 14 రోజుల్లో అమోదం తెలపాలి. ద్రవ్యబిల్లు కావడంతో ఒకవేళ రాజ్యసభ ఆమోదించకపోయినా చట్టం అమల్లోకి వస్తుంది. డిసెంబర్ 14తో గడువు ముగియనుండడంతో ఈ వారం చివరికల్లా పీఎంజీకేవై–2016పై రెవెన్యూ విభాగం ప్రకటన చేయనుంది.
నోటిఫికేషన్‌లో పన్ను చెల్లింపు వివరాలు
అప్రకటిత నగదు ఏ పద్దతిలో వెల్లడించాలి, దానిపై విధించే పన్నును వాయిదాల్లో కట్టవచ్చా లేక మొత్తం చెల్లించాలా? పీఎంజీకేవై పథకం చివరి తేదీ వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయని అధికారులు తెలిపారు. నగదు వివరాలు ప్రకటించే సమయంలో అది ఎలా వచ్చిందన్న వివరాలు పేర్కొనాల్సిన అవసరం లేదని, పన్ను చట్టాల నుంచి భద్రత ఉంటుందని, అయితే ఫెమా, పీఎంఎల్‌ఏ, నార్కొటిక్స్, విదేశీ నల్లధనం చట్టాల కింద చర్యలు తీసుకొవచ్చని పేర్కొన్నారు.
ఇంకెన్ని ప్రాణాలు పోవాలి: మమత
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఇంకెంతమంది ప్రాణాలు పోవాలంటూ ప్రధాని మోదీని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయం సరైనదేనంటూ భారత సంతతి బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ కొనియాడారు.
నగదు రహిత చెల్లింపుల్ని సులభతరం చేయాలి
నోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యల పరిష్కారాల కోసం నియమించిన కేంద్ర ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఫీచర్ ఫోన్లలో బ్యాంకు సేవల కోసం అందుబాటులో ఉన్న యూఎస్‌ఎస్‌డీ సేవల్ని మరింత సులభతరం చేయాలని, జాతీయ నగదు రహిత చెల్లింపుల విభాగమైన ఏకీకృత పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)లో కూడా మరిన్ని మార్పులు చేయాలని కమిటీ నివేదించినట్లు సమాచారం.
ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ గ్రామాల్లో సమర్ధంగా ఉపయోగపడనుందని, సామాన్య ప్రజానీకం కోసం ఈ వ్యవస్థను మరింత సులభతరం చేయాలని కోరింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిపై ఆరా తీస్తోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులపై సమీక్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కమిటీలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులే చిబ్ దుగ్గల్, ఆధార్ డైరక్టర్ జనరల్ అజయ్ పాండే తదితరులు సభ్యులుగా ఉన్నారు.
వెనెజులాలోనూ రద్దు
కారాకస్: వెనెజులాలో కూడా పెద్ద నోట్లు రద్దు చేశారు. ఆ దేశాధ్యక్షుడు నికొలాస్ మధురో పెద్ద కరెన్సీ నోటు 100 బొలివర్‌ను రద్దు చేస్తూ అత్యవసర ఆదేశంపై సంతకం చేశారు. భారీఎత్తున పెద్ద నోట్లను మాఫియా కొలంబియాలో దాచినట్లు అధ్యక్షుడు చెప్పారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనెజులా... కొత్త నోట్లు జారీచేసేందుకు సిద్ధమవుతోంది. 100 బొలివర్ నోటు(రూ. 670)తో ఒక పెద్ద సైజు చాక్లెట్ వస్తుండగా... బర్గర్ కొనాలంటే 50 బొలివర్ నోట్ల కట్ట తీసుకెళ్లాలి.