ఈనెల 21వరకు పోలీసు కస్టడీకి...
అనుమానిత ఉగ్రవాదులను కోర్టులో హాజరుపరచిన పోలీసులు
బెంగళూరు: నగరంలోని పులకేశినగరతో పాటు భట్కళ్‌లో గురువారం సాయంత్రం అరెస్టు చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నగరంలోని తొమ్మిదో ఏసీఎంఎం కోర్టులో శుక్రవారం ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంలో వీరికి న్యాయస్థానం ఈనెల 21వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఆశ్చర్యకర సమాచారం వెల్లడి....
ఇక ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల విచారణ సందర్భంగా ఆశ్చర్యకర సమాచారం వెల్లడైనట్లు తెలుస్తోంది. వీరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో పాటు కంప్యూటర్ చిప్ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ(కేఎఫ్‌డీ) సంస్థ తరఫున పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరికి సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ నేతృత్వం వహిస్తుండగా, వీరు ముగ్గురు బాంబుల తయారీ, వాటిని రిమోట్ ద్వారా పేల్చడంలో నిష్ణాతులని తెలుస్తోంది. ఇక సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ భార్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమెను కలవడానికే అఫక్ పాకిస్థాన్ వెళ్లేవాడని, అదే సందర్భంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం బెంగళూరుకు చేరుకొని ఇక్కడ కేఎఫ్‌డీ సంస్థను ఏర్పాటు చేశారని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ఇంజనీర్లు, విద్యార్థులు, వైద్యులను తన సంస్థలో చేర్చుకునేందుకు గాను పావులు కదిపాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.