మిస్టరీని ఛేదిస్తా
♦ అధికారంలోకి వస్తే అమ్మ మృతిపై విచారణ కమిషన్
♦ బినామీ ప్రభుత్వానికి ఇక చెల్లు
♦ అవినీతి అక్రమాలతో ఉత్పత్తి నిల్
♦ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా బలమైన ప్రధాన ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ సోమవారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అధికార అన్నాడీఎంకేలో వైరివర్గాల నినాదంగా ఉన్న దివంగత జయలలిత మరణ మిస్టరీ ఛేదించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిటైన జయలలిత ఇక ప్రజా జీవితంలోకి రాకుండానే డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు.
జయకోసం ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఖిన్నులైనారు. 74 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలంలో జయ కోలుకుంటున్నట్లుగా ప్రచారం చేయడం, చికిత్స పొందుతున్నట్లు జయ ఫొటోను బయటపెట్టక పోవడం, ఇన్‌చార్జ్ సీఎం పన్నీర్‌సెల్వం, ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావులను సైతం జయను చూసేందుకు అనుమతించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. శశికళపై తిరుగుబాటుచేసిన పన్నీర్‌సెల్వంతోపాటూ పలువురు జయ మరణంలో మర్మం ఉందని ఆరోపించారు. సీబీఐ, న్యాయస్థాన విచారణకు డిమాండ్ చేశారు. అన్నాడీఎంకేతో విలీనం చర్చల ఆరంభ దశలో జయ మరణంపై విచారణకు ఆదేశించాలని పన్నీర్‌సెల్వం తన ప్రధాన డిమాండ్‌గా ఎడపాడి వర్గం ముందు ఉంచారు.
అలా అన్నాడీఎంకే వరకే పరిమితమైన జయ మరణ మిస్టరీలో సోమవారం అకస్మాత్తుగా స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. అన్నాడీఎంకేలోని కుమ్ములాటలతో విసిగిపోయి ఉన్న ప్రజలు అమ్మను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. అమ్మపై చెరిగిపోని అభిమానాన్ని గుర్తించిన స్టాలిన్ ఆమెను పొగడడం ప్రారంభించారు. స్వయంశక్తి కలిగిన నాయకురాలుగా జయలలిత అధికారంలోకి వస్తే ఆమె మరణం తరువాత నేడు బినామీలు రాజ్యం ఏలుతున్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు రేసు గుర్రాల్లా అమ్ముడుపోయారని ఎద్దేవాచేశారు. అమ్మ మరణం వెనుక దాగి ఉన్న మర్మాన్ని అన్నాడీఎంకే వర్గాలు దాదాపు మరిచిపోతున్న దశలో స్టాలిన్ ప్రస్తావించడం విశేషం. పైగా డీఎంకే అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ వేస్తామని చెప్పడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు.
వేలూరు జిల్లా రాణిపేటలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లవరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం సాగుతోంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. పార్టీలోని కుమ్ములాటలతో పాలన కుంటుబడి పోగా, అవినీతి పెరిగిపోయి, అభివృద్ధి తరిగిపోయిందని విమర్శించడం ద్వారా అధికార పార్టీపై ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించే ప్రయత్నం చేయడం గమనార్హం.