► ఎంజీఆర్ శత జయంతి వేడుకలు
►ఎంజీఆర్ నివాసంలో విగ్రహావిష్కరణ
►ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
► ప్రసంగాల జోలికి వెళ్లని సీఎం పన్నీర్, శశికళ
అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే పాలనలో ఎంజీఆర్ శతజయంతి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికార లాంఛనాలతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంజీఆర్ శత జయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, చెన్నైః
చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకకు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ హాజరయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ఎంజీఆర్ శత జయంతి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఎంజీఆర్ ప్రత్యేక తపాలా బిళ్లను సీఎం పన్నీర్‌సెల్వం ఆమెకు అందజేశారు. పది నిమిషాలపాటూ పార్టీ కార్యాలయంలో గడిపిన శశికళ అక్కడి నుంచి ఎంజీఆర్ నివాసం రామాపురంతోటకు వెళ్లి అక్కడ కొత్తగా నెలకొల్పిన ఎంజీఆర్ విగ్రహాన్ని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రసంగాలు లేని శత జయంతి
తమిళనాడు సినీ, రాజకీయాల్లో ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎంజీ రామచంద్రన్ ను కీర్తిస్తూ కనీస ప్రసంగాలు లేకుండానే మంగళవారం నాటి కార్యక్రమాలను ముగించారు. ఎంజీఆర్ ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించే కార్యక్రమం చెన్నై గిండిలోని డాక్టర్ ఎంజీఆర్ వైద్య వర్సిటీలో జరిగింది. సీఎం పన్నీర్‌సెల్వం ముఖ్యఅతి«థిగా హాజరై అక్కడి ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ప్రత్యేక తపాలా బిళ్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తపాలాశాఖ సంచాలకులు డి. మూర్తి తపాలా బిళ్లను ఆవిష్కరించగా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అందుకున్నారు.
పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా ఎంజీఆర్ జీవిత పయనం, రాజకీయ విజయాలపై సీఎం పన్నీర్‌సెల్వం ప్రసంగిస్తారని ఆహూతులంతా ఆశించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తపాలా బిళ్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని 15 నిమిషాల్లోనే ముగించుకుని నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి శశికళ ఎంజీఆర్‌ణు ఉద్దేశించి ప్రసంగిస్తున్నారని, ఆమె ప్రసంగమే హైలైట్ కావాలన్న ఉద్దేశంతో సీఎం ప్రసంగంపై నిషే««దlం విధించారని అన్నాడీఎంకే శ్రేణులు గుసగుసలాడుకున్నారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యాలయంలో శశికళ సైతం ఎంజీఆర్ గురించి నాలుగు మాటలు కూడా మాట్లాడకుండానే కేవలం పదినిమిషాల్లో వెళ్లిపోయారు.
సత్యమూర్తి భవన్ లో
తమిళనాడు కాంగ్రెస్ కమిటి రాష్ట్ర కార్యాలయమైన సత్యమూర్తి భవన్ లో సైతం ఎంజీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించడం విశేషంగా మారింది. టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తమ కార్యాలయంలో ఎంజీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంజీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజలకు, అన్నాడీఎంకేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఆర్ చదువుకున్న తంజావూరు జిల్లా కుంభకోణంలోని పాఠశాలలో సైతం శతజయంతి జరిపారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం పొన్నేరిలో కట్టిన బ్యానర్‌లోని శశికళ బొమ్మను కొందరు చించివేశారు. దీంతో పోలీసులు హడావిడిగా అక్కడికి చేరుకుని అగంతకులను గుర్తించే ప్రయత్నం చేసినా వారు దొరకలేదు.
కొత్త పార్టీ ఆవిర్భావం
అన్నా ఎంజీఆర్ ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో చెన్నైలో మంగళవారం కొత్త పార్టీ వెలిసింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేకపోవడంతో ఎంజీఆర్ శత జయంతి రోజున ఈ పార్టీని స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు మురుగన్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తంగమారియప్పన్, కోశాధికారిగా కరుణానిధి అనే వ్యక్తులను నియమించినట్లు ఆయన చెప్పారు.