నటుడు ఆత్మహత్య
చెన్నై : రాష్ట్రంలోని ప్రముఖ నాయకురాలు లలితాసుభాష్ కుమారుడు, ప్రముఖ నటుడు సాయిప్రశాంత్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. వెండితెర, బుల్లితెర నటుడిగా ప్రాచుర్యం పొందిన అతడు ఆదివారం రాత్రి చెన్నై వలసరవాక్కమ్ గంగానగర్‌లోని తన ఇంటిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐందాంపడై, ముందినంపార్తేన్, ఎదో చెయ్‌దాయ్ ఎన్నై, నేరం, తెగిడి తదితర చిత్రాల్లోనే కాకుండా వీటిక్కు వీడు లూటీ,సెల్వీ, అరసి, ఇదయం, ముహూర్తం తదితర పలు టీవీ సీరియళ్లలోనూ ఆయన నటించారు.
సాయి ప్రశాంత్ మృతిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతడి మిత్రుల సాయంతో ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. సాయిప్రశాంత్ ఇంట్లో విగత జీవిగా పడి ఉన్నాడు. అతడి మృతదేహం పక్కనే మద్యం బాటిల్ ఉంది. మద్యంలో విషం కలుపుకుని తాగి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది.
అయితే సాయిప్రశాంత్ మిత్రులు మాత్రం అతను ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి వాడు కాదని చెబుతున్నారు. అతడి మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిప్రశాంత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు కీల్‌పాక్కమ్ ఆస్పత్రికి తరలించారు.
సాయిప్రశాంత్ మృతదేహం పక్కనే ఉన్న అతడు రాసిన లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సాయిప్రశాంత్ తన మరణానికి తానే కారణమని స్పష్టం చేశారు. అంతేకాని తన భార్య సుజిత గానీ మరెవ్వరూ బాధ్యులు కాదనీ ఆలేఖలో సాయిప్రశాంత్ పేర్కొన్నాడు.
కాగా సాయిప్రశాంత్ గతంలో నిరంజన అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు విడాకులు తీసుకున్నారు. అ తర్వాత సుజిత అనే యువతిని సాయిప్రశాంత్ రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆమె ఆదివారం కోవైలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంటికి రావాలంటూ సాయిప్రశాంత్ మూడు నాలు సార్లు భార్య సుజితకు ఫోన్ చేశాడు. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేందుకు ఆమె రావడానికి నిరాకరించినట్లు సమాచారం.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలూ తనను విడిచి వెళ్లి పోవడంతో మనశ్శాంతి కోల్పోయిన సాయిప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సాయిప్రశాంత్ అనూహ్య మరణం ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు బుల్లితెర పరిశ్రమలోనూ పెద్ద కలకలానికి దారి తీసింది. అతని బంధువర్గం, మిత్రబృందంలో విషాదఛాయల్ని నింపింది.