భర్తకు లేఖ... ప్రియుడితో పరార్!
బెంగళూరు: వారిద్దరూ ప్రేమించుకున్నారు.... పెళ్లి చేసుకున్నారు...ఇద్దరి ప్రేమకు గుర్తుగా నాలుగేళ్ల చిన్నారి పాప కూడా ఉంది. అయితే ఆ భార్యకు అదేం పాడుబుద్ధి కలిగిందో...మరో పురుషుడి వ్యామోహంలో పడి అతడితో వెళ్లిపోయింది. ఇప్పడు భర్త తన భార్య ఫొటో పట్టుకుని ఇల్లు వదిలి వీధివీధినా తిరుగుతూ కనిపించిన వారికల్లా ఫొటో చూపించి ఈమెను చూశారా? అంటూ దీనంగా అడుగుతున్నాడు. నెలమంగల తాలూకా దాబస్‌పేట టీచర్స్ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మండ్యకు చెందిన శ్రీనివాస్ చెన్నరాయపట్టణకు చెందిన జ్యోతి ఇద్దరూ బెంగళూరు పీణ్యలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ పరిచయమయ్యారు.
పరస్పరం ప్రేమించుకుని, ఐదేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. దాబస్‌పేటలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల పాప కూడా ఉంది. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలోకి చెన్నరాయపట్టణకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ప్రవేశించి సంసారాన్ని చిన్నాభిన్నం చేశాడు. జ్యోతిని పాత పరిచయం పేరుతో ముగ్గులోకి లాగాడు. ఫైనల్‌గా గత వారం జ్యోతి ఇంట్లో నగలు, నగదు, ఆహార ధాన్యాలు, సరుకులు మూటగట్టుకుని తన పాపతో కలిసి నాగరాజుతో ఎటో వెళ్లిపోయింది.
వెళ్తూ భర్తకు ‘మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా..సారీ..ఏడవకండి.. అంటూ చిన్న లెటర్ రాసి వెళ్లింది. ఆ రోజు నుంచి శ్రీనివాస్ ఇల్లు, పని వదిలి భార్య, పాప ఫొటోలు పట్టుకుని ఊరూరూ తిరుగుతున్నాడు. తప్పును క్షమిస్తానని, ఇంటికి రమ్మని మీడియా ముఖంగా వేడుకుంటున్నాడు. పాపను వదిలి బతకలేనని పాపను చూడాలనుందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇందుకు సంబంధించి దాబస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.